India China Relations: చైనా కంపెనీలకు గేట్లు బార్లా!
ABN , Publish Date - Jan 10 , 2026 | 04:24 AM
భారత్‌లో చైనా కంపెనీల కార్యకలాపాలకు కేంద్ర ప్రభుత్వం గేట్లు బార్లా తెరవనుందా? గల్వాన్ ఘటన అనంతరం చైనా సంస్థలపై విధించిన నియంత్రణల ఎత్తివేతకు సిద్ధమవుతోందా....
నియంత్రణల సడలింపునకు కేంద్ర ప్రభుత్వం యోచన
న్యూఢిల్లీ, జనవరి 9: భారత్‌లో చైనా కంపెనీల కార్యకలాపాలకు కేంద్ర ప్రభుత్వం గేట్లు బార్లా తెరవనుందా? గల్వాన్ ఘటన అనంతరం చైనా సంస్థలపై విధించిన నియంత్రణల ఎత్తివేతకు సిద్ధమవుతోందా? దేశంలో వివిధ రంగాల ప్రాజెక్టులకు తీవ్ర ఇబ్బందిగా మారిన నేపథ్యంలో ఈ విషయంలో తర్జనభర్జన పడుతోందా?.. కేంద్ర ఆర్థికశాఖలోని సంబంధిత అధికారవర్గాలు, రాయిటర్స్ ప్రచురించిన కథ నం ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నా యి. అయితే ఇది ప్రతిపాదనల దశలోనే ఉందని, ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొంటున్నాయి. 2020లో గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణలు, అనంతర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. భారత్‌లో చైనా కంపెనీల కార్యకలాపాలపై కేంద్రం పలు నియంత్రణలు విధించింది. భారత్‌లోని వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల టెండర్లలో ఏవైనా చైనా కంపెనీలు పాల్గొనాలంటే.. భారత ప్రభుత్వం వద్ద ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకుని, రాజకీయ, భద్రతాపరమైన క్లియరెన్సులు తీసుకోవాలి. భారత ప్రభుత్వం వద్ద చైనా ప్రభుత్వ రంగ సంస్థలు రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి ఉండదు. అంటే ఆ సంస్థలు భారత్‌లో ప్రాజెక్టులు చేపట్టడానికి వీలు ఉండదు. దీనితో లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులపై ప్రభావం పడినట్టు అంచనా. ఉదాహరణకు భారత్‌లో రూ.2 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టుకు బిడ్ వేసిన చైనా ప్రభుత్వ రైల్, రోడ్ కార్పొరేషన్ సంస్థ ఆ పనులను చేపట్టలేని పరిస్థితి నెలకొందని ప్రభుత్వ వర్గా లు తెలిపాయి. పలు థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులకూ ఇలాంటి సమస్య ఉందని పేర్కొన్నాయి. ఈ క్రమంలో చైనా కంపెనీలపై నియంత్రణలు సడలించాలని విజ్ఞప్తులు వచ్చాయని వెల్లడించాయి. దానికితోడు ప్రస్తుతం భారత్, చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తలు చల్లారడం, దౌత్యపరమైన సంబంధాలు పూర్వస్థితికి వస్తుండటంతో.. చైనా ప్రభుత్వ రంగ సంస్థలపై నియంత్రణలను తొలగించే దిశగా కసరత్తు జరుగుతున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి.