ఉగ్రవాదంపై ‘ప్రహారం’
ABN , Publish Date - Feb 24 , 2026 | 04:32 AM
ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యంగా.. ‘ప్రహార్’ పేరుతో భారత పభ్రుత్వం దేశపు మొట్టమొదటి ఉగ్రవాద వ్యతిరేక విధానాన్ని రూపొందించింది.
ఏడు కీలక అంశాలతో తొలి ‘కౌంటర్ టెర్రరిజం పాలసీ’ని రూపొందించి.. ఆవిష్కరించిన కేంద్రం
దాడుల నివారణ, సత్వర ప్రతిస్పందన, అంతర్గత సామర్థ్యాల పెంపు, అంతర్జాతీయ సహకారంపై దృష్టి
పేదరికం, నిరుద్యోగం తగ్గింపునకు చర్యలతో ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేసే యత్నం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యంగా.. ‘ప్రహార్’ పేరుతో భారత పభ్రుత్వం దేశపు మొట్టమొదటి ఉగ్రవాద వ్యతిరేక విధానాన్ని రూపొందించింది. కేంద్ర హోం శాఖ సోమవారం దీన్ని ఆవిష్కరించింది. పొరుగున్న ఉన్న కొన్ని దేశాలు కొన్నిసార్లు ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధాన సాధనంగా ఉపయోగించాయంటూ.. పేరు ప్రస్తావించకుండా పాకిస్థాన్‌ను విమర్శించింది. ‘‘భారతదేశం చాలాకాలంగా సరిహద్దుల్లో ప్రాయోజిత ఉగ్రవాదంతో (స్పాన్సర్డ్ టెర్రరిజం) ప్రభావితమై ఉంది. అల్‌ఖాయిదా, ఇస్లామిక్ స్టేట్ వంటి ఉగ్రవాద గ్రూపుల లక్ష్యంగా భారత్ ఉంది. ఇవి స్లీపర్ సెల్స్ ద్వారా దేశంలో హింసను ప్రేరేపించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఉగ్రవాదులు విదేశాల నుంచి పనిచేస్తూ భారత్‌లో హింసను ప్రోత్సహించడానికి కుట్రలు పన్నారు. ఉగ్రవాద హ్యాండ్లర్లు పంజాబ్, జమ్ముకశ్మీర్ వంటి రాష్ట్రాల్లో ఉగ్రదాడులు సులభతరం చేయడానికి డ్రోన్లు సహా పలు తాజా సాంకేతికతలను ఉపయోగిస్తున్నారు’’ అని గుర్తుచేసింది. అయితే.. భారతదేశం ఉగ్రవాదాన్ని ఏ ఒక్క నిర్దిష్ట మతానికో, జాతికో, జాతీయతకో, నాగరికతకో ముడిపెట్టదని స్పష్టం చేసింది. ఇండియా ఎల్లప్పుడూ ఉగ్రవాదాన్ని ఖండిస్తూ వస్తోందని.. ఉగ్రవాద బాధితులకు నిరంతరం అండగా నిలుస్తుందని పేర్కొంది. హింసకు ఎలాంటి సమర్థనా ఉండదనే వాదనను భారత్ గట్టిగా విశ్వసిస్తుందని.. ఉగ్రవాదంపై మనం అనుసరిస్తున్న ‘జీరో టాలరెన్స్’ విధానానికి ఆ విశ్వాసమే ఆధారమని తేల్చిచెప్పింది. ఉగ్రవాద గ్రూపులు భారతదేశంలో సులభంగా దాడులు చేయడానికి వ్యవస్థీకృత నేర నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తున్నాయని.. ఉగ్ర ప్రచారానికి, సమాచార సరఫరాకు, నిధుల చేరవేతకు, దాడులకు మార్గనిర్దేశం చేయడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను, మెసేజింగ్ యాప్స్‌ను ఉపయోగిస్తున్నాయని.. డార్క్‌వెబ్, ఎన్‌క్రిప్షన్, క్రిప్టో వాలెట్ల వంటివి ఉగ్రవాదులు అత్యంత రహస్యంగా పనిచేయడానికకి వీలు కల్పిస్తున్నాయని.. ఈ పరిణామాలన్నీ ఉగ్రవాదుల నీచ పథకాలను ఛేదించడాన్ని, వారికి నిధులు అందే మార్గాలను కష్టతరం చేస్తున్నాయని ఆందోళన వెలిబుచ్చింది. అందుకే.. ఈ సమస్యలన్నింటినీ అధిగమించే బహుళ అంచెల వ్యూహంతో.. కొత్త కౌంటర్ టెర్రరిజం విధానాన్ని రూపొందించినట్టు తెలిపింది. ఉగ్రవాదులకు, వారికి మద్దతిచ్చేవారికి, ఆర్థికంగా అండగా నిలిచేవారికి నిధులు, ఆయుధాలు, దాక్కోవడానికి సురక్షిత ప్రాంతాలు అందకుండా చేయడం ద్వారా టెర్రరిజాన్ని నిర్వీర్యం చేయడమే ఈ విధానం ఉద్దేశం. దేశీయంగా, విదేశాల నుంచి ఎదురయ్యే ఉగ్ర ముప్పులను ఎదుర్కొనేందుకు కేంద్రం ఈ పాలసీని ఏడు మూలస్తంభాల ఆధారంగా రూపొందించింది. అవి..
నివారణ: నిఘా వర్గాల సమాచారంతో ఉగ్రదాడులను ముందే పసిగట్టి అడ్డుకోవడం
ప్రతిస్పందన: దాడి జరిగినప్పుడు వేగంగా స్పందించడం
మానవహక్కులు, చట్టబద్ధమైన పాలన: ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొనేవారి పట్ల రాజ్యాంగబద్ధంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించడం. ఎవరికో అన్యాయం జరిగిందన్న భావన రాకుండా.. ఉగ్రవాదులను ప్రజాస్వామ్యబద్ధంగా చట్టప్రకారం శిక్షించడం.
ఉగ్రవాద అనుకూల పరిస్థితుల నిర్మూలన: ఉగ్రవాదులను పట్టుకోవడమే కాదు.. అసలు ఎవరైనా ఎందుకు ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్నారో గుర్తించి, అందుకు కారణమవుతున్న పరిస్థితులను.. అంటే మూలాలను తొలగించడం. ఉదాహరణకు.. పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలను ఉగ్రవాదులు తమకు అనుకూలంగా వాడుకుని యువతను ఆకర్షిస్తున్నారని.. ప్రభుత్వ పథకాల ద్వారా ఈ సమస్యలకు చెక్‌పెడుతున్నామని హోం శాఖ తన ప్రకటనలో తెలిపింది.
అంతర్జాతీయ సహకారం: ఇతరదేశాల సహకారంతో ఉగ్రవాద నెట్‌వర్క్‌లను దెబ్బతీయడం.
పునరావాసం, తిరిగి దృఢంగా నిలబడడం: ఉగ్రదాడుల వల్ల బాధితులైనవారికి.. సమాజ భాగస్వామ్యంతో అండగా నిలబడడం. ఎందుకంటే.. ప్రజలను భయకంపితులను చేయడమే ఉగ్రవాదుల ప్రధాన లక్ష్యం. అలా భయపడకుండా ప్రజలు త్వరగా తిరిగి సాధారణ జీవనం గడిపేలా చేయగలిగితే ఉగ్రవాదుల లక్ష్యం విఫలమైనట్టే. ఇందుకోసం వైద్యులు, మనస్తత్వ శాస్త్రనిపుణులు, లాయర్లు, స్వచ్ఛంద సంస్థలు, మతపెద్దల సహకారాన్ని తీసుకుంటామని కేంద్రం పేర్కొంది.
అంతర్గత సామర్థ్యాల పెంపు
ఉగ్రవాదాన్ని సమర్థంగా నిరోధించేందుకు దేశంలోని వివిధ భద్రత, దర్యాప్తు సంస్థల బలాన్ని పెంచడం. కేంద్ర ఏజెన్సీలు, రాష్ట్రాల పోలీసు విభాగాలు సమన్వయంతో పనిచేసేలా చూడడం. (ఇంటెలిజెన్స్ బ్యూరోలోని మల్టీ ఏజెన్సీ సెంటర్, జాయింట్ టాస్క్ ఫోర్స్ ఆన్ ఇంటెలిజెన్స్ ద్వారా కేంద్ర సంస్థలు, రాష్ట్రాల పోలీసు బలగాల మధ్య సన్నిహిత భాగస్వామ్యం ఇప్పటికే ఏర్పడిందని హోం శాఖ తన ప్రకటనలో పేర్కొంది).