టెక్స్‌టైల్‌కు ‘మెగా’ ఊపు
ABN , Publish Date - Feb 02 , 2026 | 04:03 AM
దేశంలో టెక్స్‌టైల్ రంగాన్ని సంఘటితపరుస్తూ తొలి మెగా పార్కును కేంద్రం ఏర్పాటు చేయనుంది. అన్ని తయారీ ప్రక్రియలను ఒక్కచోటకు తీసుకురావడం....
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1 : దేశంలో టెక్స్‌టైల్ రంగాన్ని సంఘటితపరుస్తూ తొలి మెగా పార్కును కేంద్రం ఏర్పాటు చేయనుంది. అన్ని తయారీ ప్రక్రియలను ఒక్కచోటకు తీసుకురావడం, ఉత్పత్తులకు అదనపు విలువను జోడించడం లక్ష్యంగా దీనిని నెలకొల్పనున్నారు. టెక్స్‌టైల్ రంగంలోకి పద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం, మరింతగా ఉత్పత్తులు అందుబాటులో ఉంచడం, సమీకృత హబ్‌లను పెద్దఎత్తున నెలకొల్పడం, ఎగుమతులే లక్ష్యంగా ప్రణాళికలు, నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడకపోవడం.. అనే పంచ సూత్రాలను నిర్దేశించారు. సామర్థ్యం, సాంకేతిక వినియోగం పెంచేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఖాదీ, చేనేత ఉత్పత్తులు, హస్తకళలకు చేయూతను ఇవ్వడం కోసం కొత్తగా మహాత్మాగాంధీ గ్రామ్ స్వరాజ్ పథకాన్ని ప్రతిపాదించారు. మన టెక్స్‌టైల్ ఉత్పత్తులకు మార్కెట్, బ్రాండ్‌ను సాధించడంతోపాటు ఆధునిక పద్ధతులపై శిక్షణ, నైపుణ్యాల మెరుగుదల, ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కేలా ఈ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఈ పథకం కింద కార్యక్రమాలు చేపట్టనున్నారు. ‘ఒక జిల్లా-ఒక ఉత్పత్తి’ విధానం కింద టెక్స్‌టైల్‌ను ప్రోత్సాహిస్తూ, చేనేత కార్మికులకు, గ్రామీణ పరిశ్రమలకు, యువతకు మద్దతు ఇవ్వనున్నారు. ఎక్స్‌పోర్ట్ ఆబ్లిగేషన్ గడువును (సుంకాల మినహాయింపు ఉన్న ఉత్పత్తుల ఎగుమతికి డెడ్‌లైన్) ఆరు నెలల నుంచి 12 నెలలకు పెంచడం ద్వారా ఎగుమతులకు ఊపు తీసుకురానున్నారు.