Share News

భారత్‌లో ఒకరికి ‘ముగ్గురు’!

ABN , Publish Date - Jun 29 , 2026 | 04:24 AM

ఇటీవల ఒక బుల్లితెర నటి తన బాడీ కౌంట్‌ ఐదు అని చెప్పడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. బాడీ కౌంట్‌ అంటే.. ఒకరు ఎంతమందితో లైంగిక...

భారత్‌లో ఒకరికి ‘ముగ్గురు’!

  • లైంగిక భాగస్వాముల సంఖ్యలో చివరిస్థానంలో మన దేశం

  • సగటున 14 మందితో టాప్‌లో టర్కీ

  • రెండు, మూడు స్థానాల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌

  • ‘వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ’ 2026 నివేదికలో వెల్లడి

హైదరాబాద్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): ఇటీవల ఒక బుల్లితెర నటి తన బాడీ కౌంట్‌ ఐదు అని చెప్పడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. బాడీ కౌంట్‌ అంటే.. ఒకరు ఎంతమందితో లైంగిక సంబంధం కలిగి ఉన్నారో తెలిపే సంఖ్య. సింపుల్‌గా చెప్పాలంటే.. లైంగిక భాగస్వాముల సంఖ్య. ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఎంతమందితో సెక్సువల్‌ రిలేషన్‌షిప్ కలిగి ఉంటారు? అనేది వ్యక్తిగత అంశం. కానీ.. ఏయే దేశాల్లో ప్రజలు సగటున ఎక్కువ మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉంటారనే విషయంపై అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ ‘గ్లోబల్‌ పాపులేషన్‌ రివ్యూ’ ఏటా ‘యావరేజ్‌ నంబర్‌ ఆఫ్‌ సెక్సువల్‌ పార్ట్‌నర్స్‌ బై కంట్రీ’ పేరిట ఒక నివేదిక విడుదల చేస్తుంది. అలా ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో సర్వే చేసి ఈ ఏడాది (2026) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. గ్లోబల్‌ యావరేజ్‌ (ప్రపంచ సగటు) తొమ్మిది కాగా ఈ జాబితాలో టర్కీ అగ్రస్థానంలో నిలిచింది. ఆ దేశంలో ఒక వ్యక్తి సగటున 14.5 మంది భాగస్వాములను కలిగి ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొంది. దాని ప్రకారం..

  • టర్కీ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా (సగటున ఒకరికి 13.3 మంది భాగస్వాములు), న్యూజిలాండ్‌ (13.2) ఉన్నాయి.

  • సగటున పదిమందికిపైగా భాగస్వాముల ను కలిగి ఉన్న దేశాల జాబితాలో టాప్‌-3 దేశాలతోపాటు ఐస్‌లాండ్‌, దక్షిణాఫ్రికా, ఫిన్లాండ్‌, నార్వే, ఇటలీ, స్వీడన్‌ స్విట్జర్లాండ్‌ తదితర 20దేశాలు ఉన్నాయి.

  • అగ్రరాజ్యం అమెరికా ఈ జాబితాలో 10.7 సగటుతో 12వ స్థానంలో, బ్రిటన్‌ (యునైటెడ్‌ కింగ్‌డమ్‌) 9.8 సగటుతో 21వ స్థానంలో ఉన్నాయి. అమెరికాలో ప్రాంతాలను బట్టి కూడా మార్పులు ఉన్నాయి. ఉదాహరణకు లూసియానా రాష్ట్రంలో ఈ సగటు 15.7గా ఉంటే, సంప్రదాయాలు ఎక్కువగా పాటించే యూటా రాష్ట్రంలో ఈ సగటు 2.6 మాత్రమే కావడం గమనార్హం.


మనదేశంలో..

పాశ్చాత్య దేశాలతో పోలిస్తే.. ఆసియా దేశాలలో, ముఖ్యంగా భారతదేశంలో ఈ బాడీ కౌంట్‌ అత్యంత తక్కువగా నమోదైంది. సర్వే నిర్వహించిన దేశాలన్నింటిలోకి భారత్‌ చివరి స్థానంలో నిలిచింది. భారతీయులు తమ జీవితకాలంలో సగటున ముగ్గురు లైంగిక భాగస్వాములనే కలిగి ఉంటున్నట్లు నివేదిక వెల్లడించింది. భారతదేశంలో వివాహ బంధానికి, కుటుంబ వ్యవస్థకు సమాజంలో అత్యంత ప్రాధాన్యం ఉండడం.. సంప్రదాయాలు, కట్టుబాట్లు పాటించడం.. పెళ్లికి ముందు లైంగిక సంబంధాలకు భారతీయ సమాజంలో ఆమోదం లేకపోవడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలని పేర్కొంది. ఇటువంటి పరిస్థితి ఒక్క ఇండియాలోనే కాదు.. ఆసియాలోని పలు ఇతర దేశాలలోనూ కనిపిస్తున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. హాంకాంగ్‌ (3.7), వియత్నాం (3.2), చైనా (3.1) వంటి ఇతర ఆసియా దేశాల్లో కూడా ప్రజల సగటు లైంగిక భాగస్వాముల సంఖ్య 4 కంటే తక్కువగానే ఉంది. సామాజిక నిబంధనలు, కట్టుబాట్లే ఇందుకు ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది. భౌగోళిక పరిస్థితులు, స్థానిక సంస్కృతులు, మతపరమైన నమ్మకాలు, సెక్స్‌ ఎడ్యుకేషన్‌ వంటి అంశాలు ఆయా దేశాల ప్రజల లైంగిక అలవాట్లను శాసిస్తున్నాయని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

Updated Date - Jun 29 , 2026 | 06:09 AM