Share News

జీక్యాప్‌లోకి భారత్‌

ABN , Publish Date - Aug 30 , 2026 | 06:05 AM

ఆరోతరం యుద్ధ విమానాల తయారీ కోసం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పోటీలో భారత్‌ కూడా అడుగు పెట్టింది. ఆరోతరం స్టెల్త్‌ ఫైటర్‌ జెట్‌ను ఆవిష్కరించేందుకు బ్రిటన్‌, జపాన్‌, ఇటలీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన గ్లోబల్‌ కంబాట్‌..

జీక్యాప్‌లోకి భారత్‌

  • ఆరోతరం యుద్ధ విమాన ప్రాజెక్టులో చర్చల భాగస్వామిగా చేరిక..

  • బ్రిటన్‌, జపాన్‌, ఇటలీ నేతృత్వంలో జీక్యాప్‌ ఏర్పాటు

న్యూఢిల్లీ, ఆగస్టు 29: ఆరోతరం యుద్ధ విమానాల తయారీ కోసం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పోటీలో భారత్‌ కూడా అడుగు పెట్టింది. ఆరోతరం స్టెల్త్‌ ఫైటర్‌ జెట్‌ను ఆవిష్కరించేందుకు బ్రిటన్‌, జపాన్‌, ఇటలీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన గ్లోబల్‌ కంబాట్‌ ఎయిర్‌ ప్రోగ్రామ్‌(జీక్యా్‌ప)లో మనదేశం చర్చల భాగస్వామిగా చేరింది. బ్రిటన్‌తో విస్తృత చర్చల అనంతరం భారత్‌ జీక్యా్‌పలో ప్రవేశించిందని బ్రిటన్‌ అధికారులు ధ్రువీకరించారు. జీక్యా్‌పలో కెనడా ఇప్పటికే అధికారిక పరిశీలక దేశంగా చేరింది. చర్చల భాగస్వామి హోదాలో ఈ ప్రోగ్రామ్‌పై సభ్య దేశాల మధ్య జరిగే రాజకీయ, వ్యూహాత్మక చర్చల్లో పాల్గొనే అవకాశం మనదేశానికి లభిస్తుంది. ఇందులో పెట్టుబడి పెట్టడం, సాంకేతికతను పొందటం, విమాన తయారీలో పాలుపంచుకొనే అవకాశం ఇప్పటికైతే లేదు. బ్రిటన్‌, జపాన్‌, ఇటలీలకే ఈ వెసులుబాటు ఉంది. ఇప్పటికే మనదేశం ఐదోతరం యుద్ధ విమానం తయారీ కోసం ఏఎంసీఏ ప్రాజెక్టును చేపట్టినందున ఈ దేశాల నుంచి అత్యాధునిక వైమానిక సాంకేతికత, సెన్సార్లు, ఎలక్ట్రానిక్ యుద్ధతంత్రం, ప్రొపల్షన్‌, ఆయుధ వ్యవస్థలు తదితర విభాగాల్లో సహకారం లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏఎంసీఏ ప్రాజెక్టులో భాగంగా భారత్‌కు ఐదోతరం అత్యాధునిక మఽధ్యశ్రేణి యుద్ధ విమానం 2030 తర్వాతే అందుబాటులోకి వస్తుందని అంచనా. ఆ లోపు అమెరికా, చైనా వంటి దేశాలు ఆరోతరం యుద్ధ విమానాన్ని కూడా తమ అమ్ములపొదిలో చేర్చుకొనే అవకాశం ఉంది. అందుకే మనదేశం ఏఎంసీఏ ప్రాజెక్టును కొనసాగిస్తూనే ఆరోతరం యుద్ధ విమానం కోసం జీక్యాప్‌లో చేరింది.


అమెరికా తన ఆరోతరం ఫైటర్‌ జెట్‌ ఎఫ్‌-47ను ఇప్పటికే దాదాపు సిద్ధం చేసినట్లు సమాచారం. చైనా కూడా తన ఆరో తరం ఫైటర్‌ జెట్లు జే-36, జే-50 ప్రొటోటై్‌పలను పరీక్షిస్తోంది. ఈ రెండు దేశాలకు పోటీగా బ్రిటన్‌, జపాన్‌, ఇటలీలు కలిసి జీక్యా్‌పను.. ఫ్రాన్స్‌, జర్మనీ, స్పెయిన్‌ కలిసి ఫ్యూచర్‌ కంబాట్‌ ఎయిర్‌ సిస్టమ్‌ (ఎఫ్‌సీఏఎ్‌స)లను ప్రారంభించాయి. అయితే, ఫ్రాన్స్‌తో విబేధాలతో ఎఫ్‌సీఏఎస్‌ నుంచి జర్మనీ వైదొలగింది. ఈ రెండు గ్రూపులు తమ ఫైటర్‌ జెట్లను 2030 నాటికి ఆపరేషన్‌లోకి తీసుకురావటానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.

Updated Date - Aug 30 , 2026 | 06:52 AM