పైరసీ కంటెంట్‌పై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు
ABN , Publish Date - Jul 05 , 2026 | 05:57 AM
పైరసీ కంటెంట్ విషయమై ప్రముఖ మెస్సేజింగ్ యాప్ టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు జారీ చేసింది. తన ప్లాట్‌ఫామ్‌పై పైరసీ సినిమాలు, ఓటీటీ సినిమాలు...
15 రోజుల్లోగా కార్యాచరణ నివేదికను సమర్పించాలని ఆదేశం
న్యూఢిల్లీ, జూలై 4: పైరసీ కంటెంట్ విషయమై ప్రముఖ మెస్సేజింగ్ యాప్ టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు జారీ చేసింది. తన ప్లాట్‌ఫామ్‌పై పైరసీ సినిమాలు, ఓటీటీ సినిమాలు, ఇతర ఆడియో విజువల్ మెటీరియల్‌ను విస్తృతంగా వ్యాప్తి చేయడాన్ని అరికట్టాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించి తీసుకున్న చర్యలపై 15 రోజుల్లోగా సమగ్ర కార్యాచరణ నివేదిక (ఏటీఆర్) ను సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శనివారం నోటీసులు జారీ చేసింది. కాపీ రైట్ ఉల్లంఘన సివిల్ వివాదం మాత్రమే కాదని.. పలు చట్టాల ప్రకారం క్రిమినల్ నేరమని కూడా నోటీసుల్లో పేర్కొంది. ప్రొడ్యూసర్లు, ఓటీటీ ప్లాట్‌ఫారాలు, దర్యాప్తు సంస్థల కోసం టెలిగ్రామ్ యాప్‌లో ఎటువంటి ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్ వ్యవస్థ)ను ఏర్పాటు చేశారో కూడా తెలియజేయాలని ఆదేశించింది. ఇటీవల నీట్ రీ టెస్టు సందర్భంగా టెలిగ్రామ్ యాప్‌ను కేంద్రం తాత్కాలికంగా బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే.