వర్చువల్ విచారణలు నిర్వహించండి
ABN , Publish Date - May 19 , 2026 | 04:08 AM
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు పొదుపు చర్యలను పాటించేందుకు ముఖ్యమంత్రులు, ప్రభుత్వ యంత్రాంగాలు..
సోమ, శుక్రవారాల్లో చేపట్టాలని హైకోర్టుల సీజేలకు భారత ప్రధాన న్యాయమూర్తి సూచన
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో పొదుపు చర్యలు
న్యూఢిల్లీ, మే 18: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు పొదుపు చర్యలను పాటించేందుకు ముఖ్యమంత్రులు, ప్రభుత్వ యంత్రాంగాలు, కోర్టులు సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇంధన వినియోగంతో పాటు అనవసర ఖర్చులను తగ్గించుకునేందుకు అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు సోమ, శుక్రవారాలు వర్చువల్ విచారణలు చేపట్టాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. ఈనెల 15 నుంచి సోమ, శుక్రవారాల్లో వర్చువల్ విచారణలు నిర్వహించేందుకు సుప్రీంకోర్టు నిర్ణయించింది. అలాగే ఇంధనాన్ని ఆదా చేసేందుకు న్యాయమూర్తులు కార్ పూలింగ్ (ఒకే ప్రాంతంలోని వారు ఒకే వాహనం వచ్చేలా) విధానాన్ని పాటించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఇక సోమవారం సుప్రీంకోర్టు అన్ని బెంచ్‌లలో వర్చువల్ విచారణలు సజావుగా సాగాయి. ఈ నేపథ్యంలోనే ఓ కేసు విచారణ సందర్భంగా సీజేఐని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ప్రశంసించారు. అన్ని హైకోర్టులు కూడా వర్చువల్ విచారణ చేపడితే బాగుటుందన్నారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన సీజేఐ.. గత శుక్రవారమే ఆన్‌లైన్ విచారణలపై హైకోర్టు సీజేలకు సూచనలు చేశామన్నారు.
పొదుపు చర్యలను పాటించండి..
ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ప్రభుత్వ రంగ బీమా కంపెనీలు, ఆర్థిక సంస్థలు పొదుపు చర్యలు పాటించాలని కేంద్రం సూచించింది. విదేశీ పర్యటనలను తగ్గించుకోవాలని, ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లాలని కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం సర్క్యులర్ జారీ చేసింది. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్‌ఐసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటికీ ఇవి వరిస్తాయని పేర్కొంది. పీఎ్‌సయూల చైర్మన్‌లు, సీఈవోలు, ఎండీలు నిర్దేశిత పరిమితి కంటే తక్కువ విదేశీ ప్రయాణాలు చేయాలని.. సాధ్యమైనంత వరకు సంబంధిత సమావేశాలు, సమీక్షల్లో వర్చువల్‌గా పాల్గొనాలని సూచించింది. అలాగే ప్రస్తుతం వాడుతున్న పెట్రోల్, డీజిల్ అద్దె వాహనాల స్థానంలో ఈవీలను వినియోగించాలని పేర్కొంది. ప్రస్తుత వాహన సముదాయాన్ని దశల వారీగా పూర్తిగా ఈవీలకు మార్చాలని సర్క్యులర్‌లో కోరింది.
2 కి.మీ. నడిచిన సిక్కిం సీఎం
పొదుపు చర్యల్లో భాగంగా సిక్కిం సీఎం ప్రేమ్‌సింగ్ తమాంగ్ సోమవారం ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు తన నివాసం నుంచి 2 కిలోమీటర్లకు పైగా దూరం నడిచారు. కార్యక్రమం ముగిసిన అనంతరం కూడా ఆయన ఓ ట్యాక్సీలోనే వెళ్లిపోయారు. ఈ నెల 15న కూడా ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన నడిచే వెళ్లారు. ఇక ఇంధన పొదుపు కోసం శని, ఆదివారాల్లో ప్రభుత్వ వాహనాలకు సంబంధించి సరి-బేసి విధానాన్ని పాటిస్తున్నామని.. ప్రైవేటు వాహనాలకు ఇది వర్తించదని తమాంగ్ తెలిపారు.