విదేశాల్లోని ఆస్తుల వెల్లడికి ప్రత్యేక స్కీమ్
ABN , Publish Date - Feb 02 , 2026 | 03:52 AM
విదేశాల్లో కూడబెట్టుకున్న ఆదాయం, ఆస్తుల వెల్లడి కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్‌లో ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: విదేశాల్లో కూడబెట్టుకున్న ఆదాయం, ఆస్తుల వెల్లడి కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్‌లో ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు. ఆరు నెలల పాటు అమల్లో ఉండే ఈ పథకం కింద నిర్ణీత పన్ను, జరిమానా చెల్లించి.. విదేశీ ఆదాయం, ఆస్తులను వెల్లడించి, అధికారికం చేసుకోవచ్చని తెలిపారు. తద్వారా నల్లధనం నియంత్రణ చట్టం కింద కేసులు, విచారణ నుంచి తప్పించుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ స్కీమ్ ప్రకారం.. విదేశాల్లోని ఆదాయం, ఆస్తుల వివరాలను అసలేమాత్రం వెల్లడించనివారు.. ఆ ఆదాయం/ఆస్తి విలువలో 30శాతం ఆదాయ పన్ను, మరో 30శాతాన్ని జరిమానా కింద చెల్లించాల్సి ఉంటుంది. గరిష్ఠంగా రూ.కోటి వరకు ఆదాయం/ ఆస్తిని ఈ విధానంలో వెల్లడించవచ్చు. ఇక విదేశీ ఆదాయాన్ని రిటర్నుల్లో వెల్లడించి, ఆదాయ పన్ను కట్టినా.. ఆ ఆదాయంతో విదేశాల్లో కొన్న ఆస్తుల వివరాలను వెల్లడించనివారు కేవలం రూ.లక్ష జరిమానాగా చెల్లిస్తే చాలు. గరిష్ఠంగా రూ.5 కోట్ల విలువైన ఆస్తిని వెల్లడించవచ్చు. విదేశాల్లో చదువుకున్న విద్యార్థులు, వివిధ వృత్తిపర ఉద్యోగాలు చేసినవారు, బదిలీ/డిప్యూటేషన్‌పై విదేశాలకు వెళ్లిన ఐటీ ఉద్యోగులు, భారత్‌కు తిరిగొచ్చిన ఎన్నారైలు వంటివారు విదేశాల్లో ఉన్నప్పుడు కూడబెట్టిన ఆదాయం, ఆస్తుల వివరాల వెల్లడి కోసమే ఈ స్కీమ్ ప్రవేశపెట్టామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. నల్లధనం దాచినవారు ఈ స్కీమ్‌తో ఏమాత్రం ప్రయోజనం పొందలేరని, అందుకోసమే గరిష్ఠ ఆదాయం, ఆస్తుల వెల్లడి పరిమితి విధించామని తెలిపారు. ‘ఆటోమేటిక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్’ విధానం కింద అందిన సమాచారం మేరకు.. భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు ఆయా దేశాల్లో సంపాదించిన ఆదాయం, కొన్న ఆస్తుల వివరాలను ఇక్కడ వెల్లడించలేదని పన్నుల శాఖ వర్గాలు తెలిపాయి.