Share News

వంట గ్యాస్‌ ఉత్పత్తి పెంచండి

ABN , Publish Date - Mar 07 , 2026 | 04:08 AM

ఇరాన్‌పై యుద్ధం నేపథ్యంలో ఇంధన మార్కెట్‌లో అనిశ్చితి నెలకొనడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎసెన్షియల్‌ కమోడిటీస్‌ ....

వంట గ్యాస్‌ ఉత్పత్తి పెంచండి

  • దేశీ రిఫైనరీలు, చమురు సంస్థలకు కేంద్రం ఆదేశం.. ఎస్మా అధికారాల వినియోగం

న్యూఢిల్లీ, మార్చి 6: ఇరాన్‌పై యుద్ధం నేపథ్యంలో ఇంధన మార్కెట్‌లో అనిశ్చితి నెలకొనడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎసెన్షియల్‌ కమోడిటీస్‌ యాక్ట్‌-1955 కింద తనకున్న అత్యవసర అధికారాలను వినియోగించుకుని.. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలంటూ దేశీయ చమురు శుద్ధి కర్మాగారాలకు ఆదేశాలు జారీ చేసింది. గణాంకాల ప్రకారం.. 2024-25లో భారతదేశంలో ఎల్పీజీ వినియోగం 31.3 మిలియన్‌ టన్నులు కాగా.. అందులో 12.8 మిలియన్‌ టన్నులే దేశీయంగా తయారైంది. మన ఎల్పీజీ దిగుమతుల్లో 85 నుంచి 90 శాతం గల్ఫ్‌ దేశాల నుంచే ఉండడం.. ఇప్పుడా దేశాలు ఉత్పత్తి తగ్గించడంతోపాటు, హోర్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ మూసివేయడంతో దేశీయ అవసరాలకు ఇబ్బందులు కలగకుండా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మనదేశానికి అవసరానికి మించి చమురుశుద్ధి సామర్థ్యం ఉన్నప్పటికీ.. వంటగ్యాస్‌ ఉత్పత్తిలో మాత్రం కొరత ఉంది. అందుకే.. ప్రభుత్వ, ప్రైవేటు రంగ రిఫైనరీలన్నింటినీ గరిష్ఠంగా ఎల్పీజీ ఉత్పత్తి చేయాలని, ప్రోపేన్‌, బ్యూటేన్‌ స్ట్రీమ్స్‌ను తప్పనిసరిగా ఎల్పీజీ తయారీకే ఉపయోగించాలని.. పెట్రోకెమికల్‌ ఉత్పత్తులు, ఇతర అనుబంధ ఉత్పత్తుల తయారీకి వినియోగించవద్దు, ఇతర అవసరాలకు మళ్లించవద్దని చమురు మంత్రిత్వ శాఖ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. రిఫైనరీలు ఉత్పత్తి చేసే వంటగ్యా్‌సను కేవలం ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ సంస్థలైన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, భారత్‌ పెట్రోలియం, హిందుస్థాన్‌ పెట్రోలియంలకే అందుబాటులో ఉంచాలని తేల్చిచెప్పింది. ఉత్పత్తి చేసిన ఎల్పీజీని కేవలం గృహ వినియోగదారులకు, వంట అవసరాల కోసం మాత్రమే వికయ్రించాలని, ఈ ఉత్తర్వును ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై శిక్షార్హమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా.. హోర్ముజ్‌ గుండా వచ్చే చమురు, గ్యాస్‌ సరఫరా యుద్ధం కారణంగా తగ్గిందని, దీంతో ఇతరదేశాల నుంచి ఇంధనాన్ని సేకరిస్తున్నామని కేంద్ర చమురు శాఖకు చెందిన అధికారి చెప్పారు.

Updated Date - Mar 07 , 2026 | 04:08 AM