గ్యాస్ ప్లాంట్ల వద్ద భద్రత పెంచండి
ABN , Publish Date - Mar 13 , 2026 | 04:07 AM
వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోం శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.
బ్లాక్ మార్కెట్ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోండి
అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోం శాఖ ఆదేశం
న్యూఢిల్లీ, మార్చి 12 : వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోం శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్యాస్ ప్లాంట్‌లు, డిస్ట్రిబ్యూషన్, రవాణా వ్యవస్థల వద్ద భద్రతను పెంచాలని ఆదేశించింది. అలాగే, బ్లాక్ మార్కెట్‌లో వంట గ్యాస్ సిలిండర్ల విక్రయంపై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేసింది. సాధారణ ప్రజలకు అవసరమైన వంట గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన సన్నద్ధతపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ గురువారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గ్యాస్ ప్లాంట్ల వద్ద భద్రతను పెంచాలని, అక్రమంగా సిలిండర్లను విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అలాగే, గ్యాస్ సరఫరా అంశంలో సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవాలని, పెట్రోలియం సంస్థలతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్రం ఈ సందర్భంగా రాష్ట్రాలకు సూచించింది. ఇక, గృహ అవసరాలకు అవసరమైన గ్యాస్ సిలిండర్ల ఉత్పత్తిని పెంచాలని రిఫైనరీలు, పెట్రో సంస్థలను కేంద్రం ఆదేశించింది. వాణిజ్య సిలిండర్ల సరఫరా అంశంలో ఆస్పత్రులు, విద్యా సంస్థలకు ఇబ్బంది లేకుండా చూడాలని స్పష్టం చేసింది.