ఓవర్ లోడ్‌తో హైవేలు ఎక్కితే ఫీజుల మోత
ABN , Publish Date - Apr 15 , 2026 | 04:00 AM
లారీలు, ట్రక్‌లు, ఇతర భారీ వాహనాలు నిర్దేశిత లోడ్‌కు మించిన బరువుతో జాతీయ రహదారులపైకి వస్తే భారీ ఫీజులు వసూలు చేయాలని కేంద్రం ఆదేశించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): లారీలు, ట్రక్‌లు, ఇతర భారీ వాహనాలు నిర్దేశిత లోడ్‌కు మించిన బరువుతో జాతీయ రహదారులపైకి వస్తే భారీ ఫీజులు వసూలు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఏ వాహనంలో అయినా పరిమితికి మించి 10ు వరకూ అదనంగా లోడ్ ఉంటే ఈ ఫీజుల నుంచి మినహాయింపు ఇస్తారు. అంతకంటే బరువు ఎక్కువగా ఉంటే భారీగా ఫీజులు వసూలు చేసేలా కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిర్దేశిత లోడ్ కంటే 10 శాతానికి మించి ఎక్కువగా ఉంటే సాధారణ ఫీజు కంటే రెండు రెట్లు, 40 శాతం అదనంగా ఉంటే నాలుగు రెట్ల చొప్పున ఫీజు వసూలు చేయనున్నారు. ఈ మొత్తాన్ని ఆయా వాహనాలకు ఉండే ఫాస్టాగ్ నుంచి లేదా డిజిటల్ చెల్లింపుల ద్వారా వసూలు చేయాలని మోర్త్ జాయింట్ సెక్రటరీ చేతన్ ఆనంద్‌సింగ్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పెంచిన ఫీజులు ఈ నెల 14 నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. కొత్త నిబంధనల ప్రకారం 3 యాక్సిల్ ట్రక్ 28.5 టన్నుల వరకు లోడ్‌తో వెళ్లవచ్చు. మరో 10శాతం అంటే 31.35 టన్నుల వరకు ఎలాంటి అదనపు ఫీజు వసూలు చేయరు.