నిప్పుల కుంపటిలో దేశం
ABN , Publish Date - May 22 , 2026 | 03:42 AM
ఉత్తరం, దక్షిణం అని తేడా లేకుండా సూరీడు చెలరేగిపోతున్నాడు. యావత్‌దేశం ఎండల బారిన పడి మలమల మాడుతోంది. దేశ రాజధాని ఢిల్లీ గురువారం నిప్పుల కుంపటిలా మారింది.
చెలరేగుతున్న సూరీడు
తీవ్రమైన ఎండలు.. అల్లాడుతున్న జనం
న్యూఢిల్లీ, మే 21: ఉత్తరం, దక్షిణం అని తేడా లేకుండా సూరీడు చెలరేగిపోతున్నాడు. యావత్‌దేశం ఎండల బారిన పడి మలమల మాడుతోంది. దేశ రాజధాని ఢిల్లీ గురువారం నిప్పుల కుంపటిలా మారింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 31.9 డిగ్రీల సెల్సియస్ వద్ద నమోదయ్యాయి. గరిష్ఠం ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలను చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో ఈ స్థాయి ఉష్ణోగ్రతలు 14 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. దీంతో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక యూపీ ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆ రాష్ట్రంలోని బాందాలో బుధవారం 48 డిగ్రీలు నమోదైంది. ఇది దేశంలోనే అత్యధికం. ప్రయాగ్‌రాజ్ (46.4), ఝాన్సీ (45.9), వారణాసి (43) తదితర ప్రాంతాల్లోనూ ఎండలు తీవ్రంగానే ఉన్నాయి. ఎండల కారణంగానే పంట దెబ్బతినే ప్రమాదం ఉన్నందున యూపీలో పలు ప్రాంతాల్లో రైతులు వరినాట్లను వాయిదా వేస్తున్నారు. అలీగఢ్ వంటి పట్టణాల్లోనైతే మధ్యాహ్నం వేళల్లో లాక్‌డౌన్ విధించినట్లుగా.. రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. వచ్చే 3 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంటూ ఐఎండీ యూపీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాజస్థాన్‌లోని జైపూర్, అల్వార్ నగరాల్లో రోడ్లను చల్లబరచటానికి అధికారులు ట్యాంకర్లతో నీళ్లు చల్లిస్తున్నారు. పాదచారుల కోసం తాత్కాలిక గుడారాలను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సీజన్‌లోనే గరిష్ఠ ఉష్ణోగ్రత 47.6 డిగ్రీల సెల్సియస్ పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్లలో నమోదైంది. రాష్ట్రంలో 11 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను దాటాయి. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకూ బయట తిరగటం మానుకోవాలని ప్రజలకు ఏపీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సూచించింది. హిమాచల్‌ప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో గురువారం ఉదయం 38.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనా, అధిక తేమ కారణంగా వేడి 50 డిగ్రీలను దాటిందా అన్నట్లుగా ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. మొత్తమ్మీద దేశమంతటా ఎండలు మండుతున్నాయి. వాటి నుంచి ఉపశమనం లభించాలంటే ఈ నెలాఖరు వరకూ ఆగాల్సిందేనని ఐఎండీ పేర్కొంది. సాధారణంగా జూన్ 1న కేరళ తీరాన్ని తాకే నైరుతి రుతుపవనాలు ఈ నెల 26 నాటికే ప్రవేశించవచ్చని అంచనా వేసింది. ఈ నెల 16వ తేదీనే అండమాన్ నికోబార్ దీవులను రుతుపవనాలు చేరుకున్నాయి. కేరళ నుంచి రుతుపవనాలు ఉత్తరాదికి విస్తరించటానికి కొన్ని వారాల సమయం పడుతుంది. ఏటా దేశంలో కురిసే వర్షాల్లో 70 శాతం నైరుతి రుతుపవనాల ప్రభావంతోనే పడుతుంటాయి.