Share News

ప్రపంచంలోని 20 అత్యంత వేడి నగరాల్లో 19 మన దేశంలోనే

ABN , Publish Date - Apr 22 , 2026 | 03:40 AM

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు భారత్‌ ప్రస్తుతం కేంద్ర బిందువుగా ఉంది. మన దేశంలోని అనేక నగరాలు నిప్పుల కుంపటిగా మారుతున్నాయి.

ప్రపంచంలోని 20 అత్యంత వేడి నగరాల్లో 19 మన దేశంలోనే

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 21: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు భారత్‌ ప్రస్తుతం కేంద్ర బిందువుగా ఉంది. మన దేశంలోని అనేక నగరాలు నిప్పుల కుంపటిగా మారుతున్నాయి. ప్రస్తుతం చాలా వరకు నగరాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఏక్యూఐ మంగళవారం మధ్యాహ్నం విడుదల డేటా ప్రకారం... మంగళవారం నాడు వరకు చూస్తే, ప్రపంచంలోని 20 అత్యంత వేడి నగరాల్లో 19 భారత్‌లోనే ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, బుధవారం (ఏప్రిల్‌ 22) నుంచి మూడు రోజుల పాటు వడగాడ్పుల పరిస్థితి కొనసాగుతుందని అంచనా వేసింది. బిహార్‌, ఒడిశా, పశ్చిమబెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌లోని నగరాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా పెరిగాయి. పలు చోట్ల 44 డిగ్రీలను కూడా తాకిన పరిస్థితులు నెలకొన్నాయి. బిహార్‌లోని భాగల్‌పూర్‌, ఒడిశాలోని తాల్చేర్‌, పశ్చిమబెంగాల్‌లోని అసన్‌సోల్‌ 44 డిగ్రీల ఉష్ణోగ్రతతో జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఇంకా బిహార్‌లోని బెగుసరాయ్‌, మోతిహరి, ముంగేర్‌ లాంటి నగరాలతో పాటు పశ్చివ బెంగాల్‌, తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాలు 43డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు చేశాయి. ప్రపంచంలోని టాప్‌-20 అత్యంత వేడి నగరాల్లో భారతదేశ వెలుపల ఉన్న ఒకే ఒక్క నగరం నేపాల్‌లోని లుంబిని కావడం గమనార్హం.

Updated Date - Apr 22 , 2026 | 03:40 AM