వైద్యానికి వెళితే జేబులు గుల్లే
ABN , Publish Date - Apr 22 , 2026 | 03:48 AM
ప్రైవేట్ ఆస్పత్రులు ప్రజల జేబులు గుల్ల చేస్తున్నాయి. వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరితే సగటు కుటుంబీకులు ఆర్థికంగా చితికిపోవడమే మిగులుతుందని ప్రభుత్వం తాజాగా విడుదల...
రోగుల నుంచి భారీగా డబ్బు లాగేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు
బీమా కాకుండా సగటున రూ. 34 వేలకుపైగా సొంత ఖర్చు.. ప్రభుత్వ గణాంకాల వెల్లడి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: ప్రైవేట్ ఆస్పత్రులు ప్రజల జేబులు గుల్ల చేస్తున్నాయి. వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరితే సగటు కుటుంబీకులు ఆర్థికంగా చితికిపోవడమే మిగులుతుందని ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఓ నివేదికలో స్పష్టమైంది. ఆస్పత్రుల్లో చేరిక ఖర్చులు 2017-18తో పోలిస్తే, 2025లో దాదాపు రెట్టింపు అయినట్లు ఆ నివేదిక వెల్లడించింది. ప్రసవానికి సంబంధించిన కేసులను మినహాయిస్తే ఇతర కేసుల్లో బీమా కవరేజీ కాకుండా జేబులో నుంచి చేస్తున్న (అవుట్ ఆఫ్ పాకెట్-ఓఓపీ) సగటు వ్యయం 2025లో 34,604గా ఉన్నట్లు ఆ నివేదిక వెల్లడించింది. 2023-24లో ఓ సగటు భారతీయ కుటుంబం నెలవారీ ఖర్చుతో పోల్చితే ఆస్పత్రి వ్యయం 1.64 రెట్లు ఎక్కువ ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ఓ కుటుంబం ఎదుర్కొనే ఆర్థిక భారాన్ని ఇది స్పష్టం చేస్తోంది. జాతీయ గణాంక కార్యాలయం(ఎన్‌ఎ్‌సవో) సోమవారం విడుదల చేసిన ఆరోగ్యంపై కుటుంబ సామాజిక వినియోగం నివేదికలో ఈ వివరాలను పొందుపరిచింది. 2025లో 1,35,732 కుటుంబాలను సర్వే చేసి ఈ గణాంకాలను రూపొందించింది. ఈ డేటాలో మూడు ప్రధాన విషయాలు ఉన్నాయి. మన దేశంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం కోరుకునే వారి సంఖ్య పెరిగింది. ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణతో పోలిస్తే ప్రైవేట్ హెల్త్‌కేర్ వ్యయం చాలా వేగంగా పెరిగింది. ఆస్పత్రుల్లో చేరాక ఓఓపీ ఖర్చు భారీ పెరిగిపోవడమే కాకుండా, వినియోగదారుల ధరల సూచిక (సీపీఐ)లో ఆరోగ్య ద్రవ్యోల్బణాన్ని కూడా మించి పోయింది.
ఎంత ఖర్చు చేస్తున్నారు..?
వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరితే డాక్టర్ ఫీజు, వైద్య పరీక్షలు, బెడ్ చార్జీలు, పరికరాలు, బ్లడ్, ఆక్సిజన్ తదితరాల సగటు ఓఓపీ వ్యయం రూ. 34,604గా ఉంది. ప్రసవానికి సంబంధించిన కేసుల్లో ఓఓపీ రూ. 14,755 ఖర్చు అవుతోంది. నాన్ హాస్పిటలైజేషన్ కేసుల్లో రూ. 861 ఖర్చు చేస్తున్నారు.
ఆస్పత్రుల్లో చేరాక ఓఓపీ ఖర్చు విషయంలో ప్రైవేట్ ఆస్పత్రి, ప్రభుత్వ ఆరోగ్య సదుపాయాల నిష్పత్తి 2025లో 7.6గా ఉంది. ఇదే సర్వే 2017-18లో నిర్వహించినప్పుడు ఆ నిష్పత్తి 6.8గా ఉంది.
అలాగే ఔట్ పేషెంట్ల ట్రీట్మెంట్ విషయంలో ప్రైవేట్ ఆస్పత్రులు/క్లినిక్‌లు, ప్రభుత్వ ఆరోగ్య సదుపాయాల నిష్పత్తి 2025లో 5, 3.3గా ఉండగా, ఇదే విషయంలో 2017-18లో నిష్పత్తి 3.4-1.9గా ఉంది.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో తగ్గుతున్న చేరికలు
ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఓ పక్క ఖర్చులు పెరుగుతుంటే.. మరో పక్క గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అనే వ్యత్యాసం లేకుండా వాటిలో చేరికలు కూడా పెరుగుతున్నాయి. ఇదే సమయంలో ఆస్పత్రుల్లో చేరిక (ప్రసవం మినహా) కేసుల్లో ప్రభుత్వ ఆస్పత్రుల వాటా తగ్గిపోతోంది. 2017-18లో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆరోగ్య సదుపాయాల్లో చేరికలు 45.7 శాతం ఉండగా, అది 2025 నాటికి 39.2 శాతానికి పడిపోయింది. అలాగే పట్టణ ప్రాంతాల్లో 35 శాతం నుంచి 32.2 శాతానికి తగ్గిపోయింది. ఇక ఓపీ విషయంలో మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్పత్రులు మెరుగ్గా ఉన్నాయి. ఏడేళ్ల కాలంలో 33 శాతం నుంచి 35 శాతానికి చేరికలు పెరిగాయి. కానీ పట్టణ ప్రాంతాల్లో మాత్రం 26 నుంచి 25 శాతానికి తగ్గాయి. దేశంలోని గ్రామీణ ప్రజలకు 2017-18లో బీమా కవరేజీ 2017-18లో 14.1 శాతం నుంచి 2025 నాటికి 47.4 శాతానికి పెరిగింది. అలాగే పట్టణ ప్రాంతాల్లో 19.1 శాతం నుంచి 44.3 శాతానికి పెరిగింది.