‘వైద్యం’ సామాన్యుడికి దూరం!
ABN , Publish Date - Jun 01 , 2026 | 04:09 AM
దేశంలో పేద, మధ్య తరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్‌ను వైద్య ఖర్చులు అతలాకుతలం చేస్తున్నాయి. ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందేందుకు..
ఆస్పత్రుల్లో చేరినందుకు రూ 2.9లక్షల కోట్లు.. మందులకు రూ. 1.6 లక్షల కోట్ల ఖర్చు
పెరిగిపోతున్న చికిత్సల భారం!
న్యూఢిల్లీ, మే 31: దేశంలో పేద, మధ్య తరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్‌ను వైద్య ఖర్చులు అతలాకుతలం చేస్తున్నాయి. ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందేందుకు.. బెడ్ చార్జీలు, ఆపరేషన్లు, ఐసీయూ ఖర్చుల రూపంలో ప్రజలు అత్యధికంగా రూ.2.9లక్షల కోట్లు గుమ్మరించారని కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన నేషనల్ హెల్త్ అకౌంట్స్(ఎన్‌హెచ్‌ఏ) 2022-23 నివేదిక స్పష్టం చేసింది. మందుల కోసమే ఏకంగా రూ.1.6లక్షల కోట్లు ఖర్చు చేశారని నివేదించింది. ఇందులో వైద్యులు సూచించిన మందులపై ఖర్చు రూ.1.3లక్షల కోట్లు కాగా, నేరుగా మెడికల్ షాపుల నుంచి కొన్న(సొంత వైద్యం) ఔషధాల ఖర్చు రూ. 26,670 కోట్లుగా నమోదైంది. సాధారణ ఓపీడీల కోసం రూ.1.4లక్షల కోట్ల వ్యయమైంది. ఈ ఆస్పత్రి అడ్మిషన్లు, మందులు, ఓపీడీ విభాగాలే.. దేశం మొత్తం మీద వైద్య ఆరోగ్య సంరక్షణ కోసం జరిపే ఖర్చులో అత్యధికంగా 77.3శాతాన్ని ఆక్రమించాయి. గత దశాబ్ద కాలంలో ప్రజలు తమ జేబుల నుంచి పెట్టే వైద్య ఖర్చుల శాతం క్రమంగా తగ్గుతూ వస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మందుల ధరలు సామాన్యులకు భారంగా మారాయని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా సర్వే ప్రకారం.. 12-23 నెలల వయసున్న పిల్లల్లో పూర్తిస్థాయి టీకాలు పొందిన వారి శాతం గతంలో 83ు ఉండగా, ఇప్పుడది 87ు పెరిగింది. ఐదేళ్లలోపు పిల్లల్లో ఎదుగుదల లోపం 35.4 నుంచి 29.3 శాతానికి తగ్గగా, పోషకాహార లోపంతో బాధపడే వారి శాతం 7.7 నుంచి 5.2కు పడిపోయింది. శిశువులకు తల్లి పాలు అందించే విధానంలోనూ మార్పు వచ్చింది. పుట్టిన గంటలోపు తల్లిపాలు అందించే శాతం 41.8 నుంచి 50.1కి పెరిగింది. 6 నుంచి 8 నెలల వయసున్న పిల్లలకు పాలతో పాటు అదనపు పోషకాహారాలను అందించే ప్రక్రియ 45.5 నుంచి 59.5 శాతానికి చేరింది.