India Gears Up for More Global Investments at Davos: దావోస్‌లో భారత్ జోష్
ABN , Publish Date - Jan 20 , 2026 | 01:31 AM
దావోస్ వేదికగా మరిన్ని అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు భారత్ సిద్ధమైంది. సోమవారం నుంచి ఐదు రోజుల పాటు స్విట్జర్లాండ్‌లోని దావో్‌సలో జరగనున్న 56వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు కేంద్ర మంత్రులు,...
రామ్మోహన్ నాయుడు సహా కేంద్ర మంత్రులు, చంద్రబాబు సహా రాష్ట్రాల సీఎంలు హాజరు
న్యూఢిల్లీ, జనవరి 19: దావోస్ వేదికగా మరిన్ని అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు భారత్ సిద్ధమైంది. సోమవారం నుంచి ఐదు రోజుల పాటు స్విట్జర్లాండ్‌లోని దావో్‌సలో జరగనున్న 56వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, పారిశ్రామిక ప్రముఖులు ఇప్పటికే సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు. జెన్సన్ హువాంగ్, సత్య నాదెళ్ల(ఏఐ) సహా ప్రపంచవ్యాప్తంగా 130 దేశాలకు చెందిన మూడు వేలమంది ప్రతినిధులు దావోస్ సదస్సులో పాల్గొంటున్నారు. ట్రంప్ సుంకాలు, భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితికి గురి అవుతుండటంపై సదస్సులో చర్చించనున్నారు. కాగా, అమెరికా వ్యాపార బృందానికి ట్రంప్ నేతృత్వం వహిస్తున్నారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, అశ్వినీ వైష్ణవ్, శివరాజ్‌సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషి; రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, దేవేంద్ర ఫడణవీస్, హేమంత్ సోరెన్, మోహన్ యాదవ్, హిమాంత బిశ్వా శర్మ తదితరులు ఇక్కడకు చేరుకున్నారు. మనదేశం నుంచి వందకుపైగా దిగ్గజ కంపెనీల సీఈవోలు దావోస్ చేరుకున్నారు.
భారత్‌లో రిజర్వేషన్లు భేష్
భారత్‌లో రాజకీయ రిజర్వేషన్ల అమలు తీరును ఆక్స్‌ఫామ్ ప్రశంసించింది. ఆర్థికంగా అవకాశాలు దక్కని, సామాజికంగా దూరంపెట్టిన ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యాన్ని రిజర్వేషన్లు రాజకీయాల్లో పెంచగలిగాయని తన నివేదికలో తెలిపింది. అసమానతలు ఉన్నా.. రాజకీయ, వ్యవస్థీకృత, సామాజిక మద్దతు దొరికి, విధాన నిర్ణయాలను ప్రభావితం చేసే వీలున్న రాజకీయ వ్యవస్థలు కలిగిన సమాజంలో సామాన్యులు సాధికారికతను పొందగలుగుతున్నారని తెలిపింది. ఈ నివేదికను దావోస్ సదస్సులో ఆవిష్కరించారు.