ఉద్యోగాలపై ఏఐ ప్రభావ అంచనాకు కమిటీ
ABN , Publish Date - Feb 02 , 2026 | 04:04 AM
దేశంలోని సేవల రంగంలో ఉద్యోగాల కల్పనపై కృత్రిమ మేధ (ఏఐ) వంటి కొత్త సాంకేతికతల ప్రభావం ఎలా ఉండబోతోందనే విషయాన్ని అంచనా వేసేందుకు ఉన్నత స్థాయి స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
సేవల రంగంలో ఎమర్జింగ్ టెక్నాలజీల ప్రభావంపై అధ్యయనం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: దేశంలోని సేవల రంగంలో ఉద్యోగాల కల్పనపై కృత్రిమ మేధ (ఏఐ) వంటి కొత్త సాంకేతికతల ప్రభావం ఎలా ఉండబోతోందనే విషయాన్ని అంచనా వేసేందుకు ఉన్నత స్థాయి స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2047 నాటికి ప్రపంచ సేవల మార్కెట్‌లో 10 శాతాన్ని సొంతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఐటీ, ఫైనాన్స్, టూరిజం, వైద్యం, లాజిస్టిక్స్ తదితర రంగాల్లో భవిష్యత్తులో ఉద్యోగ కల్పనను ఏఐ, ఆటోమేషన్, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ వంటివి ఎలా మార్చబోతున్నాయనే అంశాన్ని ఈ కమిటీ అంచనా వేస్తుందని మంత్రి వెల్లడించారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అత్యంత కీలకమైన సేవల రంగం అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను కమిటీ సూచిస్తుంది. ఆధునిక సాంకేతికతలకు అనుగుణంగా ఉపాధి రంగంలో కొత్తగా ప్రవేశపెట్టాల్సిన నైపుణ్యాలతోపాటు విధానపరంగా తీసుకోవాల్సిన చర్యలను కూడా ఈ కమిటీ ప్రతిపాదిస్తుంది.