భారీ ఉగ్ర కుట్ర భగ్నం!
ABN , Publish Date - Feb 23 , 2026 | 01:48 AM
దేశంలో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పాకిస్థాన్‌కు చెందిన ఐఎ్‌సఐ, బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేసే ఉగ్ర సంస్థల అండదండలతో ఢిల్లీలో విధ్వంసానికి ప్రణాళికలు రచించినట్లు అనుమానిస్తున్న 8మంది ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు ...
తమిళనాడు, బెంగాల్లో 8 మంది అరెస్టు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: దేశంలో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పాకిస్థాన్‌కు చెందిన ఐఎ్‌సఐ, బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేసే ఉగ్ర సంస్థల అండదండలతో ఢిల్లీలో విధ్వంసానికి ప్రణాళికలు రచించినట్లు అనుమానిస్తున్న 8మంది ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు పోలీసులు ఆదివారం వెల్లడించారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పాకిస్థాన్‌కు చెందిన ఉగ్ర సంస్థ లష్కరే తాయిబా పేలుళ్లకు కుట్ర పన్నిందన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా సంస్థలు శనివారం అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. పక్కా సమాచారం, ఓ పోలీసుస్టేషన్‌లో నమోదైన ఫిర్యాదు ఢిల్లీ పోలీసులు మేరకు తమిళనాడులోని పలు ప్రాంతాలు, పశ్చిమబెంగాల్లో అధికారులు సోదాలు చేపట్టారు. శనివారం తమిళనాడులో ఆరుగురిని, అంతకముందు పశ్చిమబెంగాల్‌లో మరో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారణ నిమిత్తం ఢిల్లీకి తరలించారు. పట్టుబడిన వారిలో ఏడుగురు బంగ్లాదేశీయులు కాగా, ఒకరు పశ్చిమబెంగాల్‌లోని మాల్దాకు చెందిన వ్యక్తి అని పోలీసులు తెలిపారు. వీరంతా భారతదేశంలోకి చొరబడి, నకిలీ ఆధార్ కార్డులు సంపాదించారని చెప్పారు. నిందితులంతా సోషల్ మీడియా ద్వారా ఒకరితో ఒకరు టచ్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఈ 8మందిలో నలుగురు వ్యక్తుల గ్రూపు దేశ రాజధానిలో ఏఐ సదస్సు జరుగుతున్న సమయంలో ఢిల్లీ, కోల్‌కతాలకు వెళ్లి.. పలు చోట్ల ‘ప్రీ కశ్మీర్’, ఉగ్రవాది బుర్హాన్ ఫొటోలు ఉన్న పాకిస్థాన్, ఉగ్రవాద అనుకూల పోస్టర్లను అంటించి, తిరిగి తమిళనాడు, పశ్చిమబెంగాల్‌కు వెళ్లిపోయారని అధికారులు చెప్పారు. బంగ్లాదేశ్ నుంచి లష్కరే తాయిబా ఉగ్రవాది షబ్బీర్ అహ్మద్ ఆదేశాలతో పోస్టర్లు అంటించారని, ఇతను కశ్మీర్‌కు చెందిన వ్యక్తి అని తెలిపారు.