Share News

పట్టాలపైకి ‘ఎల్‌ఎన్‌జీ’ రైలు!

ABN , Publish Date - Sep 28 , 2026 | 05:41 AM

భారతీయ రైల్వే రూపాంతరం చెందుతూ.. మరింత ఆధునికీకరణ సంతరించుకుంటోంది. పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపులో భాగంగా వేగంగా అడుగులు వేస్తోంది.

పట్టాలపైకి ‘ఎల్‌ఎన్‌జీ’ రైలు!

  • భారతీయ రైల్వేలో సరికొత్త విప్లవం

  • దేశంలోనే తొలి ఎల్‌ఎన్‌జీ రైలును ప్రారంభించిన కేంద్ర మంత్రి అమిత్‌షా

  • ఖర్చు తక్కువ.. పర్యావరణానికి మేలు

  • ఎల్‌ఎన్‌జీ లేదా డీజిల్‌తో నడిచేలా ‘డ్యూయల్‌ ఫ్యూయల్‌’ వ్యవస్థ ప్రత్యేకత

అహ్మదాబాద్‌/న్యూఢిల్లీ, సెప్టెంబరు 27: భారతీయ రైల్వే రూపాంతరం చెందుతూ.. మరింత ఆధునికీకరణ సంతరించుకుంటోంది. పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపులో భాగంగా వేగంగా అడుగులు వేస్తోంది. రెండు నెలల క్రితం దేశంలోనే తొలి హైడ్రోజన్‌ రైలును ప్రారంభించుకోగా.. తాజాగా ఆ ప్రత్యామ్నాయ ఇంధన ఆధారిత ట్రైన్ల జాబితాలో ఎల్‌ఎన్‌జీ (లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌) రైలు వచ్చి చేరింది. దేశంలోనే తొలి ఎల్‌ఎన్‌జీ రైలును కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆదివారం గుజరాత్‌లోని సబర్మతి రైల్వేస్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. డీజిల్‌ వినియోగం, ఇంధన ఖర్చులు తగ్గించడంతో పాటు కాలుష్య ఉద్గారాలను నియంత్రించే లక్ష్యంలో భాగంగా పలు ప్రత్యేకతలతో ఈ రైలును భారతీయ రైల్వే వ్యవస్థలో ప్రవేశపెట్టారు. దీని ఇంజిన్‌లో ఎల్‌ఎన్‌జీ-డీజిల్‌ ‘డ్యూయల్‌ ఫ్యూయల్‌’ వ్యవస్థను ఉపయోగించడం ప్రధాన ప్రత్యేకత. అంటే ఈ రైలు ఇంజిన్‌ అవసరాన్ని బట్టి ఎల్‌ఎల్‌జీ లేదా డీజిల్‌ ఆధారంగా నడుస్తుంది. లభ్యతను బట్టి ఇంజిన్‌ స్వయంచాలకంగా ఇంధనాన్ని మార్చుకోగలదు. ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఎల్‌ఎన్‌జీ-డీజిల్‌ డెమూ రైలు సబర్మతి నుంచి మహేసన జంక్షన్‌ వరకు నడిచింది. ఇది 8 కోచ్‌లు కలిగిన నాన్‌-ఏసీ చైర్‌ కారు రైలు. దీని రెగ్యులర్‌ రూట్‌ ఇంకా ఖరారు కాలేదు.


40 శాతం తగ్గనున్న డీజిల్‌ వాడకం

సబర్మతి ఇంటిగ్రేటెడ్‌ కోచింగ్‌ డిపోలోని 1400 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన రెండు డ్రైవింగ్‌ పవర్‌ కార్లను(డీపీసీ) ఎల్‌ఎల్‌జీ డ్యూయల్‌ ఇంధన వ్యవస్థను అనుగుణంగా మార్పులు చేశారు. దీని ద్వారా సాంప్రదాయ డీజిల్‌ వాడకాన్ని 40ు వరకూ తగ్గించొచ్చని అంచనా. ప్రతి డీపీసీ డ్యూయల్‌ ఫ్యూయల్‌ ఇంజిన్‌లో 2200 లీటర్ల సామర్థ్యం కలిగిన ఎల్‌ఎన్‌జీ ట్యాంకును ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు 950 నుంచి వెయ్యి కిలోగ్రాముల వరకూ ఎల్‌ఎన్‌జీని నిల్వ చేయవచ్చు. ఒక డీపీసీ ఇంజిన్‌ ట్యాంక్‌లో ఎల్‌ఎన్‌జీని పూర్తిగా నింపినప్పుడు.. అది సుమారు 444కిలోమీటర్లు ప్రయాణించగలదని అంచనా. ఎల్‌ఎన్‌జీ రైలు ప్రారంభోత్సవం అనంతరం అమిత్‌షా మాట్లాడారు. ప్రధాని మోదీ భారత రైల్వే వ్యవస్థను సమూలంగా మార్చివేశారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తన పాలనలో రూ.12 లక్షల కోట్లకు పైగా విలువైన మోసాలు, అవినీతి, కుంభకోణాలు పాల్పడిందే తప్ప మరేమీ చేయలేదని విమర్శించారు. హైడ్రోజన్‌, ఎల్‌ఎన్‌జీ రైళ్లలో వేర్వేరు ప్రత్యామ్నాయ ఇంధన సాంకేతికతలను ఉపయోగించారు. హైడ్రోజన్‌ రైలు నడుస్తున్న సమయంలో హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ను వినియోగించి ఫ్యూయల్‌-సెల్‌ వ్యవస్థ ద్వారా విద్యుదుత్పత్తి చేస్తుంది. ఇది నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తుంది. ఎల్‌ఎన్‌జీ రైలు డ్యూయల్‌ ఫ్యూయల్‌ ఎల్‌ఎన్‌జీ-డీజిల్‌ వ్యవస్థకు అనుగుణంగా మార్చిన ఇంటర్నల్‌ కంబస్టన్‌ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది.

Updated Date - Sep 28 , 2026 | 05:42 AM