గర్భంలోనే శిశువుకు వెన్నెముక శస్త్రచికిత్స
ABN , Publish Date - Nov 15 , 2026 | 03:14 AM
వైద్యరంగంలో భారత్ మరో అరుదైన ఘనత సాధించింది. ఢిల్లీలోని ‘అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)’ వైద్యులు దేశంలోనే తొలిసారిగా ‘ఓపెన్ ఫీటల్ సర్జరీ’ చేసి తల్లి గర్భంలోని..
దేశంలోనే తొలిసారిగా ఢిల్లీ ఎయిమ్స్‌లో ఓపెన్ ఫీటల్ సర్జరీ
25వారాల గర్భస్థ శిశువు..30 మంది వైద్యులు..6 గంటలు ఆపరేషన్
కేంద్ర ప్రభుత్వ జననీ శిశుసురక్ష పథకం కింద ఉచితంగా శస్త్రచికిత్స
న్యూఢిల్లీ, నవంబరు 14: వైద్యరంగంలో భారత్ మరో అరుదైన ఘనత సాధించింది. ఢిల్లీలోని ‘అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)’ వైద్యులు దేశంలోనే తొలిసారిగా ‘ఓపెన్ ఫీటల్ సర్జరీ’ చేసి తల్లి గర్భంలోని 25 వారాల గర్భస్థ శిశువుకు వెన్నెముకలో ఏర్పడిన తీవ్రమైన లోపాన్ని సరిచేశారు. ఢిల్లీ ఎయిమ్స్‌లోని న్యూరోసైన్సెస్ సెంటర్లో గురువారం జరిగిన ఈ శస్త్రచికిత్సకు సుమారు ఆరు గంటలకుపైగా సమయం తీసుకోవడం గమనార్హం. న్యూరోసర్జరీ విభాగానికి డాక్టర్ దీపక్ గుప్తా ఆధ్వర్యంలో ప్రసూతి వైద్య నిపుణులు నీనా మల్హోత్రా, కె.అపర్ణ శర్మతోపాటు గైనకాలజీ, న్యూరోసర్జరీ, మత్తుమందు, ప్లాస్టిక్ సర్జరీ, రేడియో డయాగ్నసిస్, నవజాత శిశు వైద్యం తదితర విభాగాలకు చెందిన 30 మందికిపైగా వైద్యులు, నర్సులు సుదీర్ఘ శస్త్రచికిత్స ప్రక్రియలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఎయిమ్స్ శనివారం వివరాలు వెల్లడించింది. ఈ శస్త్రచికిత్సను కేంద్ర ప్రభుత్వ జననీ శిశు సురక్షా కార్యక్రమం కింద ఉచితంగా నిర్వహించినట్లు ఎయిమ్స్ ప్రకటించింది. గర్భస్థ శిశువులకు వెన్నెముక శస్త్రచికిత్స చేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలన్న ప్రయత్నాలు 14ఏళ్ల క్రితమే ప్రారంభమయ్యాయని, ఇన్నేళ్ల కృషి ఇప్పుడు వాస్తవరూపం దాల్చిందని పేర్కొంది.
నమూనా ఆపరేషన్ నిర్వహించి..
ఈ గర్భస్థ శిశువు జన్యులోపంతో వచ్చే నాడీ సంబంధిత సమస్య ‘లంబోసాక్రల్ మైలోమెనింగోసీల్’తో బాధపడుతున్నట్టు గుర్తించామని వైద్యులు తెలిపారు. దీనితో పిల్లలు పుట్టాక పక్షవాతం, మెదడులో నీరు చేరడం, ఇతర నాడీ సంబంధిత వైకల్యాలు ఏర్పడే ప్రమాదం ఉంటుందని డాక్టర్ దీపక్ గుప్తా వెల్లడించారు. గర్భస్థ దశలోనే శస్త్రచికిత్స చేసి వెన్నెముక వద్ద కణజాలాన్ని సరిచేస్తే ఆ సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుందని వివరించారు. ఈ అరుదైన ఆపరేషన్ కోసం ఐదు వారాలకుపైగా సన్నాహాలు చేశామని, వివిధ విభాగాల నిపుణులు కలిసి శిశువు పరిస్థితిపై పరిశీలన, అత్యాధునిక ఇమేజింగ్ పరీక్షలు నిర్వహించడంతోపాటు శస్త్రచికిత్సకు ముందస్తు నమూనా ప్రక్రియ (ఆపరేటివ్ సిమ్యులేషన్) కూడా చేశామని తెలిపారు. తర్వాత నిపుణుల పర్యవేక్షణలో శస్త్రచికిత్స పూర్తిచేశామన్నారు.