జననాల రేటు కిందకి..!
ABN , Publish Date - May 23 , 2026 | 04:22 AM
జపాన్, చైనా, దక్షిణ కొరియా వంటి దేశాల్లాగే భారత్‌లో కూడా సంతానోత్పత్తి రేటు పడిపోతోంది..! దీంతో జననాల రేటు తగ్గిపోతోంది. జనాభా స్థిరంగా ఉండాలంటే ఒక మహిళకు సగటున ....
దేశంలో పడిపోతున్న సంతానోత్పత్తి రేటు
కొవిడ్ పూర్వపు స్థాయి కంటే ఎక్కువ మరణాలు
శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ, మే 22: జపాన్, చైనా, దక్షిణ కొరియా వంటి దేశాల్లాగే భారత్‌లో కూడా సంతానోత్పత్తి రేటు పడిపోతోంది..! దీంతో జననాల రేటు తగ్గిపోతోంది. జనాభా స్థిరంగా ఉండాలంటే ఒక మహిళకు సగటున 2.1 ప్రసవాలు (రీప్లే్‌సమెంట్ లెవెల్) అవసరం. కానీ.. భారత్‌లో సంతానోత్పత్తి రేటు రీప్లేస్‌మెంట్ లెవెల్ కంటే తక్కువగా నమోదైంది. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్-2024 నివేదిక ప్రకారం దేశంలో సంతానోత్పత్తి రేటు 1.9గా నమోదైంది. 2023లోనూ ఇది 1.9గానే ఉంది. కాగా, మరణాల రేటు కొవిడ్ పూర్వపు స్థాయి కంటే ఎక్కువగా ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొంది. భారత రిజిస్ట్రార్ జనరల్ ఆఫీసు(వోఆర్‌జీఐ) తాజాగా శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్(ఎస్ఆర్‌ఎస్) నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. దేశంలో సంతానోత్పత్తి రేటు వరుసగా ఐదో ఏడాది కూడా రీప్లే్‌సమెంట్ లెవెల్(2.1) కంటే తక్కువగా నమోదవడం, మరణాల రేటు కొవిడ్ ముందు స్థాయిల కంటే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. 2024లో దేశంలో జననాలరేటు ప్రతి 1000 జనాభాకు 18.3గా ఉండగా.. 2023లో ఇది 18.4గా నమోదైంది. పట్టణ ప్రాంతాల్లో ఇది 14.9 నుంచి 14.7కి పడిపోగా.. గ్రామీణ ప్రాంతాల్లో కూడా 20.3 నుంచి 20.2కు తగ్గింది. జననాల రేటులో మార్పు కనిపించినప్పటికీ.. ప్రతి 1000 జనాభాకు సంభవించే మరణాల సంఖ్య.. స్థూల మరణాల రేటు (సీడీఆర్) సగటు 6.4 వద్ద స్థిరంగా కొనసాగింది. నవజాత శిశు మరణాల రేటు కాస్త తగ్గింది.