గుండె లయ తప్పుతోంది!
ABN , Publish Date - May 31 , 2026 | 04:49 AM
మన దేశ యువ జనాభా గుండె లయ తప్పుతోంది. జీవనశైలి వ్యాధులతో పీల్చిపిప్పి అవుతోంది. ఊబకాయం, మధుమేహంతో ప్రజల ఆరోగ్యానికి గండి పడుతోంది.
పెరుగుతున్న హృద్రోగాలు.. ఊబకాయం, మధుమేహం ముప్పు
2022-24 ఎస్‌ఆర్‌ఎస్ డేటా, ఫ్యామిలీ హెల్త్ సర్వే వెల్లడి
న్యూఢిల్లీ, మే 30: మన దేశ యువ జనాభా గుండె లయ తప్పుతోంది. జీవనశైలి వ్యాధులతో పీల్చిపిప్పి అవుతోంది. ఊబకాయం, మధుమేహంతో ప్రజల ఆరోగ్యానికి గండి పడుతోంది. పురుషులు, మహిళలు అని తేడా ఏమీ లేకుండా.. ఏటేటా ఈ సమస్య మరింతగా పెరుగుతోంది. దేశంలో సంభవిస్తున్న మరణాల్లో 60శాతానికిపైగా మరణాలకు అసాంక్రమిక (ఎన్‌సీడీ) వ్యాధులే కారణమవుతున్నాయి. జాతీయ ‘నమూనా రిజిస్ట్రేషన్ వ్యవస్థ (ఎస్‌ఆర్‌ఎస్), జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) తాజా నివేదికల్లో ఈ ఆందోళనకర అంశాలు వెల్లడయ్యాయి.
ఆందోళనకరంగా జీవనశైలి వ్యాధులు
ఎస్‌ఆర్‌ఎస్, ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ తాము 2015-17 మధ్య (4వ సర్వే), 2019-21 మధ్య (5వ సర్వే), 2022-24 మధ్య (6వ సర్వే) చేసిన అధ్యయనాల్లో గుర్తించిన అంశాలను తాజా నివేదికల్లో పోల్చాయి. జీవన శైలి వ్యాధులు ఆందోళనకర స్థాయికి చేరాయని స్పష్టంగా పేర్కొన్నాయి. గుండె జబ్బులు, శ్వాసకోశ సమస్యలు, కేన్సర్లు, జీర్ణాశయ, కాలేయ, కిడ్నీ వ్యాధులు వంటి అసాంక్రమిక వ్యాధుల (ఎన్‌సీడీ) మరణాలు పెరుగుతున్నాయని నివేదికలు వెల్లడించాయి. దేశంలో సంభవించిన మొత్తం మరణాల్లో.. 2022-24లో 60శాతం అసాంక్రమిక వ్యాధుల వల్లే జరిగాయి. 2015-17 నాటితో పోలిస్తే ఇది 7.3 శాతం అధికం. అంతేకాదు 2022-24 మధ్య సంభవించిన ఎన్‌సీడీ మరణాల్లో 32.1 శాతం హృద్రోగాల కారణంగానే జరగడం ఆందోళనకరం. అయితే 2015-17లో 22శాతంగా ఉన్న అంటువ్యాధులు, ప్రసూతి, ప్రసవానంతర, పోషకాహారలోప మరణాలు 2022-24 నాటికి 19.7 శాతానికి తగ్గాయి.
30-40 ఏళ్ల వారిలో హృద్రోగాలు పెరుగుతున్నాయి. 30-69 మధ్య వయస్కుల్లోని మరణాల్లో 37.3 శాతం హృద్రోగ సంబంధమైనవే. 2022-24 మధ్య సంభవించిన మరణాల్లో 55ఏళ్లు పైబడ్డవారు 69.3శాతంకాగా.. 30-44 మధ్య పనిచేసే వయసులో చనిపోయిన వారు 19.5శాతం మంది ఉన్నారు.
15-29 ఏళ్ల మధ్య యువతలో ఆత్మహత్యల మరణాలు పెరుగుతున్నాయి. 2022-24లో ఈ వయసువారి మరణాల్లో ఆత్మహత్యలు 19శాతానికి పెరిగాయి. 2015-17లో ఇవి 16.3 శాతమే.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6 నివేదిక ప్రకారం.. ఊబకాయం, మధుమేహం సమస్య వేగంగా పెరుగుతోంది. మహిళల్లో ఊబకాయం, పురుషుల్లో మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. దేశంలో 15-49 ఏళ్ల మధ్య మహిళల్లో 2019-21లో 24శాతం ఊబకాయులు అయితే.. 2022-24 నాటికి ఈ శాతం 30.7కి పెరిగింది. పురుషుల్లో ఊబకాయం సమస్య 22.9 శాతం నుంచి 27.3 శాతానికి పెరిగింది. 2015-17లో మహిళల్లో 20.6శాతం, పురుషుల్లో 18.9శాతం మాత్రమే ఊబకాయులు కావడం గమనార్హం.
2015-17లో పురుషుల్లో 8శాతం, మహిళల్లో 5.8శాతం మధుమేహం బాధితులుకాగా, 2022-24 నాటికి పురుషులు 20.9శాతం, మహిళలు 17.8శాతం కి చేరుకోవడం ఆందోళనకరం.
2019-21తో పోలిస్తే 2022-24 నాటికి అధిక రక్తపోటు సమస్య స్వల్పంగా తగ్గింది.
మహిళల్లో పెరిగిన ఇంటర్నెట్ వినియోగం
తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశంలో ఇంటర్నెట్ వాడుతున్న మహిళ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2019-2021లో ఒక్కసారైనా ఇంటర్నెట్ వాడిన మహిళల సంఖ్య 33.3 శాతమేకాగా, 2023-24 నాటికి 64.3 శాతానికి చేరింది. ఇంటర్నెట్ వాడే మహిళల శాతంలో కేరళ 87.3శాతంతో టాప్‌లో ఉండగా, తెలంగాణ 64.8శాతం, ఏపీ 63.6శాతం, తమిళనాడు 59.5శాతం, కర్ణాటక 57.9 శాతాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక తాజా సర్వే ప్రకారం వ్యక్తిగత బ్యాంకు ఖాతాలున్న మహిళల శాతం 89కి చేరింది.
తగ్గని బాల్య వివాహాలు, గృహ హింస
ఒకవైపు మహిళలు సామాజిక, ఆర్థిక అంశాల్లో పురోగతి సాధిస్తుంటే.. మరోవైపు గృహహింస, బాల్య వివాహాల బెడద మాత్రం తప్పడం లేదు. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ తాజా నివేదిక ప్రకారం ఇప్పటికీ 20శాతం మంది మహిళలకు 18 ఏళ్లలోపే వివాహాలు జరుగుతున్నాయి. ఇక భర్త నుంచి గృహ హింసను ఎదుర్కొంటున్న మహిళల సంఖ్య 22.3 శాతంగా ఉంది. 2019-21 నాటి సర్వేలోని 29.2 శాతంతో పోలిస్తే తగ్గుదల నమోదైంది. మరేరాష్ట్రంలో లేనంతగా కర్ణాటకలో మహిళలపై గృహహింస 2019-21 నాటి 44.4శాతంతో పోల్చితే తాజాగా 14.1శాతానికి తగ్గడం గమనార్హం. మరోవైపు దేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన కేరళలో మహిళలపై గృహ హింస 9.8 శాతం నుంచి 17.7 శాతానికి పెరిగింది. దక్షిణాది రాష్ట్రాల్లో గృహ హింస ఎదుర్కొంటున్న మహిళల సంఖ్య తెలంగాణలో అత్యధికంగా 30.8 శాతంగా ఉంది. తమిళనాడులో 28.5, ఆంధ్రప్రదేశ్ 22.7 శాతంగా ఉంది.