4 వేల కోట్ల స్పామ్ కాల్స్, 13 వేల కోట్ల స్పామ్ మెసేజ్‌లు
ABN , Publish Date - Feb 12 , 2026 | 03:27 AM
టెక్నాలజీ ఎంత అప్‌డేట్ అయితే.. సైబర్ నేరగాళ్లు కూడా అంతలా ముదురుతున్నారు. గతంలో ఫోన్ కాల్, మెసేజ్‌లు చేసి మోసాలు చేసే దశ నుంచి..
ఏఐ వాయిస్, అనుకరణలతో సైబర్ నేరగాళ్ల మోసాలు.. మెసేజింగ్ యాప్‌ల్లో చొరబడి ఖాతాలు ఖాళీ
ట్రూకాలర్ ఇండియా ఇన్‌సైట్ రిపోర్టులో వెల్లడి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: టెక్నాలజీ ఎంత అప్‌డేట్ అయితే.. సైబర్ నేరగాళ్లు కూడా అంతలా ముదురుతున్నారు. గతంలో ఫోన్ కాల్, మెసేజ్‌లు చేసి మోసాలు చేసే దశ నుంచి.. ప్రస్తుతం డిజిటల్ అరెస్టులు, ఏఐ వాయిస్ అనుకరణలు లాంటి పలు రకాల మోసాలతో బురిడీ కొట్టిస్తున్నారు. అలాగే ప్రఖ్యాత కంపెనీలను అనుకరిస్తూ మెసేజింగ్ యాప్స్ ద్వారా కూడా మన ఫోన్లలోకి జొరబడి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. వచ్చే రోజుల్లో ఈనేరగాళ్లు మరింతగా సవాళ్లు విసరనున్నారు. దేశంలో స్కామ్‌ల ముప్పు ఎలా పరిణమిస్తోందో ట్రూకాలర్ యాప్ తన ఇండియా ఇన్‌సైట్ రిపోర్టు-2025లో వివరించింది. 32 కోట్ల ట్రూకాలర్ వినియోగదారుల డేటాను విశ్లేషించి ఇటీవల విడుదల చేసిన ఆ నివేదికను తయారు చేసింది. కొత్త రూపాల్లోని స్కామ్‌ల్లో గుర్తింపు ధ్రువీకరణకు చెందినవి, సుపరిచిత సంస్థలను అనుకరించి చేసే వంచనలు, కాల్స్, మెసేజ్‌లు కలిపి మోసం, ఏఐతో చేసిన వాయిస్ సందేశాలు తదితరాలు ఉంటున్నాయి. ‘‘తాము స్వయంగా బదిలీ చేసిన డబ్బు న్యాయబద్ధంగా చేశామని స్కామర్ల బాధితులు భావిస్తారు. డిజిటల్ అరెస్టు దీనికి ఉదాహరణ. బాధితుల ప్రమేయం లేకుండా బ్యాంకు ఖాతాలను, ఫోన్లను స్కామర్లు వారి అధీనంలోకి తీసుకుని, ఓటీపీతో డబ్బు బదిలీ చేసే స్కామ్‌లకు, డిజిటల్ అరెస్టులకు తేడా ఉంది’’ అని ట్రూకాలర్ సీఈవో రిషిత్ ఝున్‌ఝున్‌వాలా చెప్పారు. ట్రూకాలర్ నివేదిక ప్రకారం.. సాధారణ ఎస్‌ఎంఎస్, ఫోన్ కాల్స్‌కు బదులుగా థర్డ్ పార్టీ మెసేజింగ్ యాప్స్ అయిన వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ డైరెక్ట్ మేసేజ్ (డీఎం), టెలీగ్రామ్ లాంటి వాటిని నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. అలాగే ఎస్‌ఎంఎ్‌సలతో ఫేక్ కరెంట్ బిల్లులు, ట్రాఫిక్ చలాన్ల వంటి వాటి ద్వారా డబ్బు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ట్రూకాలర్ ఇన్‌స్టాల్ చేసుకున్న వినియోగదారుల ద్వారా 4,168 కోట్ల స్పామ్ కాల్స్‌ను, 12,903 కోట్ల స్పామ్ మెసేజ్‌లను గుర్తించారు. ఈ స్పామ్ కాల్స్‌లో 770 కోట్ల కాల్స్ బ్యాంకులను, ప్రభుత్వ సంస్థలను, పేమెంట్ ప్లాట్‌ఫామ్‌లను, ప్రఖ్యాత బ్రాండ్లను అనుకరించి మోసం చేసే ఉద్దేశంతో చేసినవే. ఇక స్కామర్ల లక్ష్యం ముఖ్యంగా వృద్ధులే. వీరైతేనే వాళ్ల వలలో సులువుగా పడతారు. స్కామ్ జరిగిన విషయం బయటకు చెప్పలేరు. కమ్యూనిటీ రిపోర్టింగ్ సహకారంతో 1,189 కోట్ల స్పామ్ కాల్స్‌ను వినియోగదారులకు చేరకుండా ట్రూకాలర్ అడ్డుకుంది. ఒక్కో స్పామ్ కాల్‌కు 1.8 నిమిషాల సమయం అనుకుంటే, మొత్తం స్పామ్ కాల్స్‌ను అడ్డుకోవడం ద్వారా ప్రతిరోజు 21.7 లక్షల గంటల సమయాన్ని, ప్రతి వారానికి 1.5 కోట్ల గంటల సమయాన్ని ట్రూకాలర్ కాపాడింది. ఇక ఆండ్రాయిడ్, ఐఫోన్ల కోసం ట్రూకాలర్ ఫ్యామిలీ ప్రొటెక్షన్ ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఐదుగురు సభ్యులు దీనిలో ఉంటారు. సభ్యులెవరికైనా స్కామ్ కాల్ వస్తే వెంటనే అడ్మిన్‌కు నోటిఫికేషన్ వెళుతుంది. బ్లాక్ చేసిన స్కామర్ల నంబర్లను సభ్యులు షేర్ చేసుకోవచ్చు. కాగా, ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ వివరాల ప్రకారం.. 2025లో భారతీయులు మోసాల కారణంగా రూ. 19,813 కోట్లు కోల్పోయారు. వీటిపై 21.77 లక్షల ఫిర్యాదులు నమోదయ్యాయి. అధునాతన టెక్నాలజీ వినియోగంతో జరుగుతున్న ఈ మోసాలను, మోసగాళ్లను గుర్తించడం కష్టంగా మారుతోంది.