Share News

గ్యాస్‌ అవసరాల్లో 25 శాతం లోటు

ABN , Publish Date - Mar 13 , 2026 | 03:54 AM

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా మన దేశ గ్యాస్‌ అవసరాల్లో 25 శాతం కోత పడింది. ఈ లోటును ప్రత్యామ్నాయ మార్గాల్లో గ్యాస్‌ ఉత్పత్తులను సేకరించడం ద్వారా పూడ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు.....

గ్యాస్‌ అవసరాల్లో 25 శాతం లోటు

  • యుద్ధం వేళ భయపెడుతున్న కొరత

  • ముడి చమురుకు ప్రస్తుతానికి కొరత లేదు

  • కేంద్ర ప్రభుత్వం ప్రకటన

న్యూఢిల్లీ, మార్చి 12: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా మన దేశ గ్యాస్‌ అవసరాల్లో 25 శాతం కోత పడింది. ఈ లోటును ప్రత్యామ్నాయ మార్గాల్లో గ్యాస్‌ ఉత్పత్తులను సేకరించడం ద్వారా పూడ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని సీనియర్‌ అధికార వర్గాలు బుధవారం తెలిపాయి. భారత్‌కు దిగుమతి అయ్యే చమురులో దాదాపు యాభై శాతం హోర్ముజ్‌ జలసంధి ద్వారానే అందేది. యుద్ధం వేళ ఈ జలసంధిని ఇరాన్‌ మూసివేసింది. ఫలితంగా ఇంధనాలు, గ్యాస్‌ ధరలు అమాంతం పెరిగిపోయాయి. ‘‘దేశ అవసరాలకు రోజుకు 18.9కోట్ల మెట్రిక్‌ స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్ల సహజ వాయువు అవసరం. ఇందులో 9.75 కోట్ల క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ మనదేశంలోనే ఉత్పత్తి అవుతుండగా, మిగతా ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాం. ఈ దిగుమతుల్లో యుద్ధం కారణంగా 4.74 కోట్ల క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ ఉత్పత్తులకు గండి పడింది.’’ అని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రటరీ సుజాత శర్మ వెల్లడించారు. కొత్త మార్గాల ద్వారా ఈ లోటును పూడ్చుకుంటున్నామన్న ఆమె.. ఎల్‌ఎన్‌జీ ఉత్పత్తులతో బయలుదేరిన రెండు కార్గోలు త్వరలోనే భారత్‌కు చేరుకోనున్నాయని తెలిపారు. గ్యాస్‌ కొరతను దృష్టిలో ఉంచుకుని గృహాలకు, ఆటోమొబైల్‌ పరిశ్రమకు మాత్రమే సరఫరా చేయనున్నట్టు వివరించారు. కాగా, ముడి చమురుకు దేశంలో కొరత లేదని శర్మ పేర్కొన్నారు. రోజువారీగా అవసరమైన 55లక్షల బ్యారెళ్ల ముడిచమురు 40 దేశాల నుంచి దిగుమతి అవుతోందన్నారు. అయితే, కొత్త మార్గాల్లో సేకరించడం వల్ల సాధారణం కంటే ఎక్కువ రేటుకు గ్యాస్‌ కొంటున్నామని చెప్పారు.

Updated Date - Mar 13 , 2026 | 03:54 AM