మనవారిని తీసుకురావడం ఎలా?
ABN , Publish Date - Mar 03 , 2026 | 04:20 AM
పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం మరింత తీవ్రతరం కావటం, ఇది కనీసం నాలుగైదు వారాలపాటు కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించటంతో ఆయా దేశాల్లోని భారతీయుల.....
ఈజిప్టు, పశ్చిమాసియా దేశాల్లో 90 లక్షల మంది భారతీయులు
యుద్ధం నేపథ్యంలో వారి పరిస్థితిపై కేంద్రం దృష్టి
ఇజ్రాయెల్ ప్రధాని, యూఏఈ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్
న్యూఢిల్లీ, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం మరింత తీవ్రతరం కావటం, ఇది కనీసం నాలుగైదు వారాలపాటు కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించటంతో ఆయా దేశాల్లోని భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం యుద్ధ ప్రభావం ఉన్న దేశాల్లో దాదాపు 90 లక్షలకు పైగా భారతీయులు ఉన్నారు. యుద్ధ కేంద్రాలుగా మారిన ఇరాన్‌లో పది వేలమంది, ఇజ్రాయెల్‌లో 20 వేలమంది విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నారని అంచనా. వీరి భద్రతపై కేంద్ర ప్రభుత్వం నిత్యం ఆయా దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది. నిత్యం డ్రోన్, క్షిపణి దాడులు కొనసాగుతుండటంతో యూఏఈ, కువైట్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, ఇరాన్, ఇజ్రాయెల్ తదితర దేశాలన్నీ తమ గగనతలాలను మూసివేశాయి. దీంతో అక్కడి భారతీయులు తిరిగి రావటానికి దారులు మూసుకుపోయాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఆదివారం సాయంత్రం భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశమై తాజా పరిస్థితి గురించి దాదాపు 3 గంటలు చర్చించింది. హోం, రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక మంత్రులతోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్న ఈ సమావేశంలో పశ్చిమాసియాలోని భారతీయుల పరిస్థితిపై చర్చించారు. యుద్ధం మరింత ముదిరితే భారతీయులను సురక్షితంగా స్వదేశానికి ఎలా తరలించాలన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. ముందయితే ఆయా దేశాల ముఖ్యులతో మాట్లాడి భారతీయులకు భద్రత కల్పించాలని కోరాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ సమావేశం ముగిసిన వెంటనే ప్రధాని మోదీ.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఫోన్‌చేసి అక్కడి భారతీయుల పరిస్థితిపై ఆరా తీశారు. యుద్ధం తాజా పరిస్థితిపై చర్చించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు నహ్యాన్‌తో కూడా మోదీ మాట్లాడారు. అక్కడ చిక్కుకుపోయిన భారతీయులకు అవసరమైన సౌకర్యాలు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
భూమార్గంలో ్డవెళ్లిపోవచ్చు: ఇరాన్
ఇరాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులు సహా విదేశీయులంతా భూమార్గంలో వారి దేశాలకు వెళ్లిపోవచ్చని ఆ దేశం సోమవారం సూచించింది. ఇందుకోసం అధికారుల అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని ఇరాన్ తస్నిమ్ న్యూస్ తెలిపింది. ఆర్మేనియా, అజర్‌బైజాన్ సరిహద్దుల గుండా భూమార్గంలో వెళ్లిపోయేందుకు అవకాశం ఉందని సూచించింది. అయితే, తాము చదువుతున్న యూనివర్సిటీల మొండి వైఖరి కారణంగానే తాము యుద్ధభూమిలో చిక్కుకుపోయినట్లు ఇరాన్‌లోని భారతీయ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ‘యుద్ధం ప్రారంభానికి ముందే ఇరాన్‌ను వీడాలని భారత రాయబార కార్యాలయం మాకు సూచించింది. కానీ, మా యూనివర్సిటీ అందుకు ఒప్పుకోలేదు’ అని చెప్పారు. కాగా, గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న కన్నడిగులను రక్షించడం తమ బాధ్యత అని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య భరోసా ఇచ్చారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పౌర విమానయానశాఖ, భారత రాయబార కార్యాలయాలతో నిరంతరం సంప్రదిస్తున్నామని పేర్కొన్నారు.
అప్రమత్తంగా ఉండండి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది. మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని గత నెల 28న లేఖలు రాసింది. ముఖ్యంగా కొన్ని వర్గాల ప్రజలు బహిరంగంగా నిరసనలు తెలిపే అవకాశం ఉన్నందున సున్నిత ప్రాంతాల్లో నిఘా పెంచాలని, అమెరికా, ఇజ్రాయెల్ కాన్సులేట్ల వద్ద భద్రత పెంచాలని సూచించింది.