భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. నేడే
ABN , Publish Date - Jan 27 , 2026 | 03:08 AM
చరిత్రాత్మక ‘భారత్-యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం’పై మంగళవారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
శిఖరాగ్ర సదస్సులో అధికారిక ప్రకటన
డొనాల్డ్ ట్రంప్ విచ్చలవిడి ఆంక్షల నేపథ్యంలో ఒప్పందానికి విశేష ప్రాధాన్యం
రక్షణ రంగంలోనూ ఇరుపక్షాల భాగస్వామ్యం
ఉద్యోగాల కోసం యూర్‌పకు వెళ్లటం భారతీయులకు ఇక సులువు!
అవగాహన ఒప్పందం కుదిరే అవకాశం
ప్రపంచ సుస్థిరతకు భారత్ కీలకం: ఉర్సులా
న్యూఢిల్లీ, జనవరి 26: చరిత్రాత్మక ‘భారత్-యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం’పై మంగళవారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఢిల్లీలో జరిగే భారత్-ఈయూ శిఖరాగ్ర సదస్సు ఇందుకు వేదిక కానుంది. గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథులుగా హాజరైన యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాల నేతృత్వంలోని ప్రతినిధుల బృందంతో ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని భారత బృందం ఈ సదస్సులో సమగ్రమైన చర్చలు నిర్వహించనుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలతో భారత్‌తోపాటు యూరప్ దేశాలు కూడా తీవ్రంగా ప్రభావితమవుతున్న నేపథ్యంలో.. భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని విశిష్టమైన ప్రాధాన్యం ఉంది. ఈ ఒప్పందంతో 200 కోట్ల జనాభాతో కూడిన అతిభారీ మార్కెట్ ఆవిర్భవిస్తుందని, ఇది ప్రపంచ జీడీపీలో దాదాపు 25 శాతానికి సమానమని ఇటీవల ఉర్సులా వ్యాఖ్యానించటం ఈ ఒప్పందానికి ఉన్న ప్రాముఖ్యతను తెలుపుతోంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో వాణిజ్యం, వాతావరణ మార్పులు, టెక్నాలజీ తదితర రంగాల్లో భారత్-యూర్‌ప మధ్య భాగస్వామ్యం కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంది. ‘భారత్ విజయవంతంగా ఉంటేనే ప్రపంచం మరింత స్థిరంగా, సుసంపన్నంగా, సుస్థిరంగా ఉంటుంది. భారత రిపబ్లిక్ డే ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రావటం నా జీవితకాలంపాటు గుర్తుంచుకోదగిన గౌరవం’ అంటూ ఉర్సులా తన సంతోషాన్ని వెలిబుచ్చారు. మంగళవారం జరిగే భారత్-ఈయూ శిఖరాగ్ర సదస్సులో.. వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కూడా ఖరారయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిద్వారా 15,000 కోట్ల యూరోల (రూ.16,31,400 కోట్ల) విలువైన ‘యూరప్ సెక్యూరిటీ యాక్షన్’ (సేఫ్) ప్రాజెక్టులో భారతీయ సంస్థలు కూడా పాల్గొనే అవకాశం లభిస్తుంది. యూరప్ దేశాలు రక్షణ సన్నద్ధతను పెంచుకోవటానికి ఆర్థిక సహకారం అందించే ప్రాజెక్టు సేఫ్. సరుకుల వాణిజ్యానికి సంబంధించి భారత్‌కు ఈయూ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2024-25లో ఈయూతో భారత్ 13,600 కోట్ల యూరోల (రూ.14,79,136 కోట్లు) వాణిజ్యం జరిపింది.