Share News

ప్రపంచానికి భారత్‌ ఆశాకిరణం!

ABN , Publish Date - Jan 30 , 2026 | 03:31 AM

భారతదేశం ప్రపంచానికి ఆశాకిరణంగా ఆవిర్భవించిందని ప్రధాని మోదీ అన్నారు. యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)..

ప్రపంచానికి భారత్‌ ఆశాకిరణం!

ఈయూతో డీల్‌ ఉత్పత్తిదారులకు భలే చాన్స్‌: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, జనవరి 29: భారతదేశం ప్రపంచానికి ఆశాకిరణంగా ఆవిర్భవించిందని ప్రధాని మోదీ అన్నారు. యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ).. అన్ని ఒప్పందాలకూ తల్లి వంటిదని.. తమ సామర్థ్యాలు పెంచుకోవడానికి దేశానికి, ఉత్పత్తిదారులకు కూడా మంచి అవకాశం లభించిందని తెలిపారు. కేంద్ర బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో గురువారం పార్లమెంటు ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సంస్కరణల రథంపై దేశం పరుగులుపెడుతోంది. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తాం. ఇది పార్లమెంటు కార్యకలాపాల స్తంభనకు సమయం కాదు..పరిష్కారాలకు సమయం’ అని చెప్పారు. బుధవారం ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగం 140 కోట్ల మంది వ్యక్తీకరించిన అభిప్రాయంగా అభివర్ణించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వరుసగా 9 బడ్జెట్లు ప్రవేశపెట్టడం భారత పార్లమెంటరీ చరిత్రలోనే గర్వించదగిన విషయమని, ఈ ఘనత సాధించిన తొలి మహిళా ఆర్థిక మంత్రిగా పేరు సంపాదించారని ప్రధాని పేర్కొన్నారు. ఆమె తన 9వ బడ్జెట్‌ను ఆదివారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ 10 సార్లు, మాజీ మంత్రి పి.చిదంబరం 9 సార్లు బడ్జెట్‌ పెట్టినా.. వరుసగా కాకుండా అప్పుడప్పుడూ ప్రవేశపెట్టారు. కాగా, బడ్జెట్‌ సమావేశాల ముంగిట మోదీ సందేశం.. ఎప్పటిలాగే కపటత్వంతో కూడుకుని ఉందని కాంగ్రెస్‌ ఆరోపించింది.

Updated Date - Jan 30 , 2026 | 03:31 AM