రక్షణ రంగంలో భారత్ విశ్వసనీయ భాగస్వామి
ABN , Publish Date - Jul 27 , 2026 | 06:41 AM
రక్షణ రంగంలో భారత్ ఒక విశ్వసనీయమైన భాగస్వామిగా ఎదుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. ‘మన్ కీ బాత్’లో 136వ ఎపిసోడ్‌లో భాగంగా ఆదివారం ఆయన ప్రసంగించారు...
పినాక రాకెట్, కుశ క్షిపణులతో రక్షణ వ్యవస్థ బలోపేతం
‘మన్ కీ బాత్’లో మోదీ ..కార్గిల్ యుద్ధ వీరులకు నివాళి
న్యూఢిల్లీ, జూలై 26 (ఆంధ్రజ్యోతి): రక్షణ రంగంలో భారత్ ఒక విశ్వసనీయమైన భాగస్వామిగా ఎదుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. ‘మన్ కీ బాత్’లో 136వ ఎపిసోడ్‌లో భాగంగా ఆదివారం ఆయన ప్రసంగించారు. దేశ సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడంలో భాగంగా ఇటీవల ఐఎన్‌ఎస్ మహేంద్రగిరిని భారత నేవీలోకి చేర్చినట్లు పేర్కొన్నారు. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన ఈ ఆధునిక యుద్ధ నౌకలో 75 శాతానికి పైగా స్వదేశీ పరికరాలనే వినియోగించడం ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రతీకని తెలిపారు. పినాక లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్‌ను, కుశ క్షిపణిని డీఆర్‌డీవో ఈ నెలలోనే విజయవంతంగా పరీక్షించిందన్నారు. అలాగే బ్రహ్మోస్, అస్త్ర క్షిపణుల కోసం ఇండోనేషియాతో కీలక ఒప్పందం కుదిరిందని చెప్పారు. జూలై 18న దేశ తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-1’ను శ్రీహరికోటలో విజయవంతంగా ప్రయోగించారని తెలిపారు. జూలై 26న దేశమంతా ‘కార్గిల్ విజయ్ దివ్‌స’ను జరుపుకుందని ప్రధాని గుర్తుచేశారు. ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో శత్రువులతో వీరోచితంగా పోరాడిన భారత సైనికులకు ఆయన ఘన నివాళులు అర్పించారు. నీటి సంరక్షణ చర్యల్లో ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తోందని మోదీ ఈ సందర్భంగా కొనియాడారు. రాష్ట్రంలో పాత చెరువులను మళ్లీ వాడుకలోకి తెచ్చారని ప్రశంసించారు. వినాయక చవితికి మట్టితో తయారు చేసిన గణేశుడి విగ్రహాలనే ఉపయోగించాలని ప్రధాని కోరారు.