Share News

ఉగ్రవాదుల జాబితాలోసయీద్‌ అల్లుడు

ABN , Publish Date - Jul 05 , 2026 | 06:00 AM

మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్టు, లష్కరే తాయిబా అధినేత హఫీజ్‌ మహమ్మద్‌ సయీద్‌ అల్లుడు ఖలీద్‌ వాలీద్‌ను కేంద్ర హోం శాఖ ‘ఉపా’ చట్టం కింద ఉగ్రవాదిగా ప్రకటించింది.

ఉగ్రవాదుల జాబితాలోసయీద్‌ అల్లుడు

  • లష్కరే, జైషేకు చెందిన 23 మందితో జాబితా

న్యూఢిల్లీ, జూలై 4: మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్టు, లష్కరే తాయిబా అధినేత హఫీజ్‌ మహమ్మద్‌ సయీద్‌ అల్లుడు ఖలీద్‌ వాలీద్‌ను కేంద్ర హోం శాఖ ‘ఉపా’ చట్టం కింద ఉగ్రవాదిగా ప్రకటించింది. ఐదుగురు జవాన్లు సహా ఆరుగురిని 2016లో బలిగొన్న పాంపోర్‌ ఉగ్రదాడి వాలీద్‌ పనేనని భద్రతా బలగాలు గుర్తించాయి. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) అడ్డాగా కశ్మీర్‌లోని బలగాలపై దాడులకు పథకాలు రచించే వాలీద్‌ను 2012లోనే అమెరికా ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇతనితోపాటు పాక్‌, పీవోకే కేంద్రంగా పనిచేస్తున్న మరో 22 మంది టాప్‌ కమాండర్లతో ఉగ్రవాద జాబితాను కేంద్ర హోం శాఖ విడుదల చేసింది. ఈ జాబితాలో ఆరుగురు భారత జాతీయులు కూడా ఉన్నారు. అయోధ్య రామాలయం, నాగ్‌పూర్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయం వద్ద భారీ పేలుళ్లకు కుట్ర చేసిన కేసులో ప్రధాన నిందితుడు, జైషే మహమ్మద్‌ అధినేత మసూద్‌ అజహార్‌ ముఖ్య అనుచరుడు ముసాదిక్‌ను కూడా కేంద్రం ఉగ్ర జాబితాలో చేర్చింది. జాబితాలోని భారత జాతీయుల్లో... ఫిర్దోస్‌ అహ్మద్‌ భట్‌ ఆయుధాల అక్రమ తరలింపులో కీలకంగా ఉన్నాడు. హరూన్‌ రషీద్‌ గవాయి లష్కరే తాయిబాలో చేరి మిలిటెంట్లకు అవసరమైన సహకారం అందిస్తున్నాడు. బిలాల్‌ అహ్మద్‌ మీర్‌ జిహాదీ కార్యకలాపాలను యువతలోకి తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహస్తున్నాడు. అబీద్‌ ఖయూమ్‌ లోనే లష్కరే కోసం విరాళాలు సేకరిస్తున్నాడు. నజీర్‌ అహ్మద్‌ గుజ్జార్‌ జమ్మూ యువతను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్నాడు.

Updated Date - Jul 05 , 2026 | 06:00 AM