Share News

దేశంలో వంట గ్యాస్‌కు కొరత లేదు : కేంద్రం

ABN , Publish Date - Apr 06 , 2026 | 03:55 AM

దేశంలో వంట గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని కేంద్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. 5 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ల(ఎఫ్‌టీఎల్‌ సిలిండర్లు) విక్రయాలు జోరుగా సాగుతున్నాయని ప్రకటించింది.

దేశంలో వంట గ్యాస్‌కు కొరత లేదు : కేంద్రం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 5 : దేశంలో వంట గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని కేంద్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. 5 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ల(ఎఫ్‌టీఎల్‌ సిలిండర్లు) విక్రయాలు జోరుగా సాగుతున్నాయని ప్రకటించింది. గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ను పొందాలంటే సరఫదారుకు నివాస ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. కానీ 5 కిలోల ఎఫ్‌టీఎల్‌ సిలిండర్‌ను సరఫరాదారు నుంచి నేరుగా కొనుగోలు చేయవచ్చు. అయితే, 2026 మార్చి 23 నుంచి ఆదివారం వరకు 6.6 లక్షల ఎఫ్‌టీఎల్‌ సిలిండర్ల అమ్మకాలు జరిగాయని కేంద్ర పెట్రోలియం శాఖ ప్రకటించింది. బ్లాక్‌లో సిలిండర్ల విక్రయానికి సంబంధించి మార్చి నుంచి 50వేలకు పైగా సిలిండర్లను సీజ్‌ చేశామని, 1400 మందికి పైగా ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని వెల్లడించింది. వాణిజ్య సిలిండర్ల సరఫరా కూడా డిమాండ్‌కు అనుగుణంగా క్రమంగా పెరుగుతోందని తెలిపింది. ఏప్రిల్‌ 6 నుంచి ఎరువుల పరిశ్రమలకు సహజ వాయువు సరఫరాను కూడా పెంచుతామని పేర్కొంది. కాగా, ఇరాన్‌ యుద్ధం ప్రభావం అమెరికా పౌరులపై పడుతోంది. దేశంలో గ్యాస్‌, చమురు ధరలు పెరగడంతో.. వివిధ కంపెనీలు సెస్‌లు రూపంలో ప్రజలపై అదనపు భారాన్ని మోపుతున్నాయి. ఏప్రిల్‌ 17 నుంచి కొన్ని డెలివరీలపై 3.5 శాతం ఫ్యూయల్‌ సర్‌ చార్జీని వసూలు చేస్తామని ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ప్రకటించింది. రవాణా ఖర్చులు పెరిగిన నేపథ్యంలో బుధవారం నుంచి ప్యాకేజింగ్‌, డెలివరీలపై 8 శాతం ఫ్యూయల్‌ సర్‌చార్జి వసూలు చేస్తామని అమెరికా పోస్టల్‌ సర్వీస్‌ కూడా ప్రకటించింది. కొన్ని విమానయాన సంస్థలు చెకిన్‌ లగేజీ ధరలను పెంచాయి.

Updated Date - Apr 06 , 2026 | 03:55 AM