Share News

ఖమేనీ మృతికి సంతాపం తెలిపిన భారత్‌

ABN , Publish Date - Mar 06 , 2026 | 04:09 AM

ఇరాన్‌ సుప్రీంలీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ మృతికి గురువారం భారత్‌ సంతాపం తెలిపింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ...

ఖమేనీ మృతికి సంతాపం తెలిపిన భారత్‌

ఇరాన్‌ రాయబార కార్యాలయానికి వెళ్లినవిదేశీ వ్యవహారాల కార్యదర్శి

న్యూఢిల్లీ, మార్చి 5: ఇరాన్‌ సుప్రీంలీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ మృతికి గురువారం భారత్‌ సంతాపం తెలిపింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ న్యూఢిల్లీలోని ఇరాన్‌ రాయబార కార్యాలయానికి వెళ్లి సానుభూతి తెలిపారు. అక్కడ ఉన్న సంతాప సందేశాల పుస్తకంలో భారత ప్రభుత్వం తరఫున సంతాప సందేశం రాసి సంతకం చేశారు. భారత్‌లోని ఇరాన్‌ రాయబారి మహమ్మద్‌ ఫతాలితో మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను విదేశీ వ్యవహారాల శాఖ విడుదల చేసింది. గత నెల 28న అమెరికా-ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో ఖమేనీ మరణించారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలని భారత్‌ పిలుపునిచ్చినప్పటికీ ఖమేనీ హత్యపై మాత్రం స్పందించలేదు. ఖమేనీ మృతి పట్ల ప్రభుత్వం తరఫున స్పందించనందుకు ప్రతిపక్షాలు విమర్శించాయి. ఈ నేపథ్యంలో విదేశీ వ్యవహారాల కార్యదర్శి ఇరాన్‌ రాయబార కార్యాలయానికి వెళ్లి, సంతాప సందేశం రాయడం ప్రాధాన్యం సంతరించుకొంది. మరోవైపు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఇరాన్‌ విదేశాంగ మంత్రి సెయెద్‌ అరగ్చీతో ఫోన్‌లో మాట్లాడారు. ఏ విషయమై చర్చించారనేది ఇంకా తెలియరాలేదు.

Updated Date - Mar 06 , 2026 | 04:10 AM