Share News

జనాభా లెక్కలు..జనవరి 25 నుంచి

ABN , Publish Date - Oct 31 , 2026 | 02:46 AM

దేశంలో జనాభా లెక్కలకు షెడ్యూల్‌ ఖరారైంది. 2027 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు దేశవ్యాప్తంగా జనగణన జరగనుంది.

జనాభా లెక్కలు..జనవరి 25 నుంచి

  • దేశ వ్యాప్తంగా ఫిబ్రవరి 28 వరకు

  • జనవరి 10-24 వరకు సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌కు అవకాశం

  • అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలు, మంచు ప్రభావ ప్రాంతాలకు మినహాయింపు

న్యూఢిల్లీ, అక్టోబరు 30: దేశంలో జనాభా లెక్కలకు షెడ్యూల్‌ ఖరారైంది. 2027 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు దేశవ్యాప్తంగా జనగణన జరగనుంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలు, మంచు ప్రభావిత ప్రాంతాల్లో మినహా దేశవ్యాప్తంగా ఎన్యుమరేటర్లు ఇంటింటికి వచ్చి పౌరుల వివరాలు సేకరిస్తారు. అంతకముందు 2027 జనవరి 10 నుంచి జనవరి 24వ తేదీ వరకు పౌరులకు సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌కు అవకాశమిచ్చారు. ఈ తేదీల్లో ప్రజలు ఆన్‌లైన్‌ లేదా నిర్దేశిత విధానంలో తమ వివరాలను స్వయంగా జనగణనలో నమోదు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌జీఐ), జనాభా లెక్కల కమిషనర్‌ మృత్యుంజయ్‌ కుమార్‌ నారాయణ్‌ శుక్రవారం జారీ చేశారు. 2027 మార్చి 1ని జనగణనకు రిఫరెన్స్‌ తేదీగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మార్చి 1 నుంచి మార్చి 5వ తేదీ వరకు సవరణలకు అవకాశమిచ్చారు. అయితే, వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే మణిపూర్‌(తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు), గోవా, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతం లద్ధాఖ్‌కు, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌లో మంచు ప్రభావిత ప్రాంతాలకు ఈ ఉత్తర్వులు వర్తించవు. కాగా, జనాభా లెక్కల ప్రక్రియ రెండు దశల్లో నిర్వహిస్తారు. తొలిదశలో ఇళ్ల జాబితా, గృహ పరిస్థితులు, సౌకర్యాలు వంటి వివరాలు సేకరిస్తారు. ఇది ఇప్పటికే పూర్తైంది. రెండో దశలో వ్యక్తుల జనాభా, సామాజిక, ఆర్థిక వివరాలను నమోదు చేస్తారు.

Updated Date - Oct 31 , 2026 | 02:49 AM