దేశానికి స్వాతంత్య్రం వచ్చాక.. తొలిసారి కులగణన
ABN , Publish Date - Aug 15 , 2026 | 05:25 AM
మంచు ప్రభావిత ప్రాంతాలైన లద్దాఖ్, జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ తదితర ప్రాంతాల్లో సెప్టెంబరు 1 నుంచే జనాభా లెక్కల సేకరణ ప్రారంభం కానున్న నేపథ్యంలో..
సిద్ధం చేసిన కులాల జాబితా కాకుండా ప్రజలు
చెప్పే వాటినే నమోదు చేసుకోనున్న ఎన్యుమరేటర్లు
40 ప్రశ్నలను నోటిఫై చేసిన భారత రిజిస్ట్రార్ జనరల్
మంచు ప్రభావిత రాష్ట్రాల్లో 1 నుంచి జనగణన
ఆన్‌లైన్‌లో నమోదుకు ఆగస్టు 17-31 మధ్య చాన్స్
న్యూఢిల్లీ, ఆగస్టు 14: మంచు ప్రభావిత ప్రాంతాలైన లద్దాఖ్, జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ తదితర ప్రాంతాల్లో సెప్టెంబరు 1 నుంచే జనాభా లెక్కల సేకరణ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఆ ప్రక్రియలో అడగాల్సిన 40 ప్రశ్నలను కేంద్రం శుక్రవారం నోటిఫై చేసింది. భారత రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ జనగణనలో ప్రజల కులం వివరాలు కూడా సేకరించనున్నారు. అయితే, ప్రశ్నపత్రంలో కులాల జాబితా ఏమీ ఉండదు. ప్రజలు తమ కులం గురించి ఏ వివరాలు చెప్తే ఎన్యుమరేటర్లు వాటినే నమోదు చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. దాంతోపాటు.. పెళ్లి అయిందా? లేదా? తల్లిదండ్రుల వివరాలు, జాతీయత, మతం, మాతృభాష, ఎంతవరకూ చదువుకున్నారు?, పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? ఉద్యోగులైతే రోజూ ఎలా వెళ్తారు? ఏ కంపెనీ/ఏ రంగంలో పనిచేస్తున్నారు? పుట్టిన ఊరు, ఇంతకు ముందు ఎక్కడ ఉండేవారు? వలస రావడానికి కారణం? ఎన్ని బ్యాంకు ఖాతాలున్నాయి? డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? శాశ్వత నివాస చిరునామా ఏమిటి? మొబైల్, ఆధార్, పాస్‌పోర్ట్ నంబర్లు, ఓటర్ ఐడీ తదితర వివరాలను కూడా నమోదు చేయనున్నారు. ప్రజలు ఆన్‌లైన్‌లో ఈ వివరాలను నమోదు చేసుకునేందుకు ఆగస్టు 17 నుంచి 31 దాకా అవకాశం కల్పించనున్నట్టు కేంద్రం తెలిపింది. జనగణన మొదటి దశలో భాగంగా ఏప్రిల్ 16న మొదలైన ఇళ్లజాబితా నమోదు కార్యక్రమం సెప్టెంబరు 30 దాకా కొనసాగనుంది. రెండో దశలో ఈ వివరాలన్నీ సేకరించనున్నారు.
దేశంలోని మిగతా ప్రాంతాలన్నింటిలో వచ్చే ఏడాది నుంచి వివరాలు సేకరిస్తారు. కాగా.. ఈ ప్రక్రియలో కులాల వివరాలు సేకరించే తీరుపై, రాజకీయ పార్టీలతో చర్చ జరపకపోవడంపై కాంగ్రెస్ మండిపడింది. బిహార్, తెలంగాణల్లో నిర్వహించిన కులగణన తరహాలోనే రాష్ట్రాలవారీగా కులాలజాబితాను ముందే సిద్ధం చేసి జనగణన చేపడతారని అంతా ఊహించారని, కానీ అలా జరగలేదని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ ‘ఎక్స్’లో అభ్యంతరం వ్యక్తం చేశారు. జనగణనలో బీసీ కులాల వివరాలను సేకరిస్తామంటూ ఇచ్చిన హామీని కేంద్రం విస్మరించడం ఆందోళన కలిగించే విషయమని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అన్నారు.