అంతిమ నష్టం అమెరికాకే!
ABN , Publish Date - Mar 04 , 2026 | 03:34 AM
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ చోటుచేసుకుంటున్న పరిణామాలు ఎటువైపు దారితీస్తాయోనన్న.....
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య రాజీకి భారత్ ప్రయత్నించవచ్చు
ఇరాన్‌నూ తక్కువ అంచనా వేయలేం
చైనా, రష్యా, ఉత్తరకొరియా మద్దతు తోడైతే మూడో ప్రపంచ యుద్ధమే
ఆంధ్రజ్యోతితో భారత మాజీ రాయబారి డాక్టర్ బీఎం వినోద్ కుమార్
హైదరాబాద్ సిటీ, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ చోటుచేసుకుంటున్న పరిణామాలు ఎటువైపు దారితీస్తాయోనన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జర్మనీ, రష్యా తదితరదేశాల్లో సుదీర్ఘకాలం భారత రాయబారిగా సేవలు అందించి ప్రస్తుతం తెలంగాణ ప్రవాస భారతీయుల సలహాసంఘం అధ్యక్షుడిగా పని చేస్తున్న డాక్టర్ బీఎం వినోద్ కుమార్ తాజా పరిణామాలపై తన విశ్లేషణను ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ల యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉందా?
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం లేకపోలేదనిపిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడితో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగడం సాధారణమే. ఆ క్రమంలో పశ్చిమాసియా దేశాల్లోని అమెరికా స్థావరాలు తుదముట్టించడమే ఇరాన్ లక్ష్యమైనా తమ దేశాలపై క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించడం ఆపకపోతే దెబ్బకు దెబ్బ తప్పదని గల్ఫ్ దేశాలు హెచ్చరిస్తున్నాయి. సైప్రస్ దేశంలోని యూకే స్థావరం, గల్ఫ్ దేశాల్లోని ఫ్రాన్స్ స్థావరం కూడా ఇరాన్ క్షిపణుల దాడితో నేలమట్టమైనట్టు సమాచారం. దాంతో ఆ దేశాలూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్‌లో తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని నెలకొల్పాలన్నది ట్రంప్ ఆలోచన. అదంత సులభంకాదు. సుప్రీం లీడర్‌నే కోల్పోయిన ఇరాన్ పోరాడి ప్రాణాలు వదిలితే స్వర్గానికైనా వెళతాంకానీ ఇజ్రాయెల్, అమెరికాకు లొంగిపోయేది లేదన్న ధోరణితోనే ముందుకెళుతున్నట్టుంది. కాబట్టి ఇరు దేశాల మధ్య దాడులు ప్రాంతీయ యుద్ధంగా పరిణమించే ప్రమాదం లేకపోలేదు. మరో వారం గడిస్తేగానీ స్పష్టమైన అంచనాకు రాలేం.
పొరుగుదేశాలను పగచేసుకొని ఇరాన్ సాధించేది ఏంటి?
గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్‌కు పూర్తి వ్యతిరేకమైనా ఇరాన్‌కు మద్దతుగా నిలువలేవు. అమెరికాతో సత్సంబంధాలుండటంతో ఈ దాడిని ఆ దేశాలేవీ వ్యతిరేకించనూలేవు. ఇరాన్ గల్ఫ్‌దేశాలపై క్షిపణులు, డ్రోన్ల దాడులు కొనసాగిస్తే పశ్చిమాసియా దేశాలను ఇరాన్‌పైకి అమెరికా ఉసిగొల్పే అవకాశం లేకపోలేదు. ఇరాన్‌కు రష్యా, చైనా, ఉత్తర కొరియా మద్దతు ప్రకటించాయి. ఇరాన్‌ను తక్కువ అంచనా వేయలేం. అమెరికాకున్న బలంలో ఇరవై శాతమైనా ఇరాన్‌కు ఉంది. లెబనాన్‌లో హెజ్బొల్లా... గాజాలో హమాస్... యెమెన్‌లో హూతీలు ఇరాన్‌కు అత్యంత బలం. ఈ తిరుగుబాటుదారులు ఇప్పటికే ఇజ్రాయెల్‌పై ప్రతీకారచర్యలకు దిగారు. ఇరాన్‌ను లొంగదీసుకోవడం ట్రంప్‌కు అంత సులభంకాదు. అమెరికా ప్రయోజనాలకన్నా ట్రంప్ వ్యక్తిగత ప్రయోజనాలే ఇరాన్‌పై దాడిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ట్రంప్ పేరు బలంగా వినిపిస్తోంది. ఎప్‌స్టీన్ ఫైల్స్ నుంచి తప్పించుకోవడానికే కాదు ఆ కేసు నుంచి దృష్టిమరల్చడానికీ ట్రంప్ ఇదంతా చేస్తున్నాడన్నది ఒక వర్గం వాదన.
అమెరికాకు కలిగే లాభనష్టాలేంటి?
ఆయిల్ క్రయవిక్రయాలన్నీ ప్రపంచవ్యాప్తంగా డాలర్ రూపంలో జరగాలన్నది అమెరికా ఉద్దేశం. అలా జరగని పక్షంలో డాలర్ విలువ పతనమవుతుంది కూడా. ఆయిల్ ఉత్పత్తి దేశాలపై నియంత్రణ కోసం అమెరికా పరితపిస్తోంది. ఇరాన్ నుంచి ఉత్పత్తయ్యే 40ు ఆయిల్‌ను చైనా దిగుమతి చేసుకుంటుంది. ఇరాన్‌ను గుప్పిట్లోకి తీసుకుంటే చైనాను నియంత్రించవచ్చన్నదీ వ్యూహంలో భాగం. అమెరికా అధ్యక్షుడి చర్యలు మరింత హద్దుమీరితే మాత్రం ఇరాన్‌కు చైనా, రష్యా, ఉత్తర కొరియా తోడుకావొచ్చు. అప్పుడు మూడో ప్రపంచ యుద్ధం మొదలైందనే అనుకోవాలి. ఒకవేళ యుద్ధం అంటూ జరిగితే అంతిమంగా నష్టపోయేది అమెరికానే. ట్రంప్ చర్యలతో రిపబ్లికన్ పార్టీకి ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగింది. ఈ ఏడాది నవంబరు2న అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఘోరపరాభవం తప్పేట్టులేదు.
భారత్ ఎలాంటి అడుగులు వేయాలి?
ఇజ్రాయెల్, ఇరాన్‌లతో స్నేహసంబంధాలు కలిగిన భారత్ ఆ రెండు దేశాల మధ్య రాజీకి ప్రయత్నించవచ్చు. మనం ఏ ఒక్కదేశం పక్షాన వకాల్తా తీసుకోకూడదు.