భారత్ శాంతి, సుస్థిరతలనే కోరుకుంటుంది
ABN , Publish Date - Mar 03 , 2026 | 04:03 AM
పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ ఎప్పుడూ శాంతి, సుస్థిరతలనే కోరుకుంటుందని ప్రధాని మోదీ చెప్పారు.
సౌదీ, బహ్రెయిన్, జోర్డాన్ దేశాధినేతలకు మోదీ ఫోన్
మోదీకి ధన్యవాదాలు తెలిపిన నెతన్యాహు
న్యూఢిల్లీ, మార్చి 2: పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ ఎప్పుడూ శాంతి, సుస్థిరతలనే కోరుకుంటుందని ప్రధాని మోదీ చెప్పారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో కెనడా ప్రధాని కార్నీతో సంయుక్త విలేకరుల సమావేశంలో పాల్గొన్న మోదీ పశ్చిమాసియాలో పరిస్థితులపై మాట్లాడారు. చర్చలు, దౌత్యం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలనేదే భారత విధానమని ఆయన పునరుద్ఘాటించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోదీ.. సౌదీ, బహ్రెయిన్, జోర్డాన్ దేశాధినేతలకు ఫోన్ చేశారు. సౌదీ అరేబియా రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌తో మోదీ మాట్లాడారు. సౌదీపై జరిగిన దాడులను ఆయన ఖండించారు. భారతీయులను జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతోనూ మోదీ ఫోన్‌లో మాట్లాడి భారతీయుల క్షేమ సమాచారం గురించి ఆరా తీశారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా-2తో కూడా మోదీ ఫోన్‌లో మాట్లాడారు. మరోవైపు, మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ధన్యవాదాలు తెలిపారు. తమకు అండగా నిలిచిన స్నేహితుడు మోదీకి ధన్యవాదాలంటూ ఆయన భారతీయ మీడియా ప్రతినిధులతో అన్నారు.