దేశీయంగా విమానాల తయారీకి ఊతం
ABN , Publish Date - Feb 02 , 2026 | 03:47 AM
దేశంలో విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పులకు కారణమయ్యే రెండు కీలక నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకున్నారు.
పౌర, శిక్షణ విమానాల తయారీకి అవసరమైన భాగాలు, విడిభాగాలపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: దేశంలో విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పులకు కారణమయ్యే రెండు కీలక నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకున్నారు. వాటిలో ఒకటి.. పౌర, శిక్షణ, ఇతర విమానాల తయారీకి అవసరమైన భాగాలు, విడిభాగాలపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు. రెండోది.. రక్షణ విభాగాలు నిర్వహణ, మరమ్మతు, ఓవర్‌హాల్ కోసం ఉపయోగించే భాగాల తయారీకి ముడిపదార్థాల దిగుమతిపైన కూడా ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు. ఈ రెండు నిర్ణయాలూ దేశ రక్షణ-ఏరోస్పేస్ ఇండస్ట్రీకి ఊతమివ్వనున్నాయి. ముఖ్యంగా.. మొదటి నిర్ణయం వల్ల దేశంలో దేశీయంగా విమానాల తయారీ ఊపందుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే.. సుంకాల కారణంగా విమానాల తయారీకి అవసరమైన విడిభాగాలను దిగుమతి చేసుకోవడం ప్రస్తుతం ఖరీదైన వ్యవహారంగా ఉంది. కానీ, బేసిక్ కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు వల్ల ఇప్పటికే ఈ రంగంలో ఉన్న విదేశీ దిగ్గజ కంపెనీలతోపాటు, దేశీయ స్టార్ట్‌పలు కూడా విడిభాగాలను దిగుమతి చేసుకుని మనదేశంలోనే విమానాల అసెంబ్లింగ్‌కి ఎక్కువగా ఆసక్తి చూపుతాయి. విమానాల మరమ్మతులు, నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయి. దీనివల్ల.. ఇప్పటిదాకా రక్షణ రంగానికి మాత్రమే పరిమితమైన ‘భారత్‌లోనే తయారీ’ పౌర విమానయాన రంగానికీ విస్తరిస్తుంది. తద్వారా ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి. విమానాల మరమ్మతు, నిర్వహణ ఖర్చులు తగ్గడం వల్ల.. ప్రయాణికులపై పడే టికెట్ భారం కూడా తగ్గుతుంది.