ఈసీ నిర్ణయాలను సమీక్షించండి
ABN , Publish Date - Oct 13 , 2026 | 06:48 AM
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం(ఈసీ) తీసుకున్న అన్ని నిర్ణయాలను సమీక్షించాలని ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సుప్రీంకోర్టులో ఇండియా కూటమి నేతల పిటిషన్ .. నేడు విచారణ!
న్యూఢిల్లీ, అక్టోబరు 12: ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం(ఈసీ) తీసుకున్న అన్ని నిర్ణయాలను సమీక్షించాలని ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎస్‌ఐఆర్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ, తృణమూల్ ఎంపీ సౌగతారాయ్, ఎస్పీ అధినేత అఖిలేశ్, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్,సుప్రియాసూలే(ఎన్సీపీ-ఎస్పీ), సంజయ్‌రౌత్(శివసేన-ఉద్ధవ్), డీ.రాజా(సీపీఐ), ఎంఏ బేబీ(సీపీఎం), మహువా మాఝి(జేఎంఎం) సంయుక్తంగా ఈ పిటిషన్ వేశారు. ఎన్నికల సంఘం, సీఈసీ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌సింగ్ సంధు, వివేక్ జోషిలను ప్రతివాదులగా చేర్చారు. సాయంత్రం 4.30లోగా పిటిషన్ దాఖలు చేయాల్సి ఉండగా.. ఆలోపు రాహుల్‌గాంధీ తదితరులు సుప్రీంకోర్టుకు రాలేకపోయారు. దీంతో న్యాయవాది ప్రసన్న పిటిషన్ దాఖలు చేశారు. తర్వాత సంబంధిత పత్రాలపై సంతకం చేయటానికి రాహుల్, ఖర్గే, ఇతర నేతలు కోర్టుకు వెళ్లారు. ప్రతిపక్ష నేతలు తమ పిటిషన్‌లో పలు కీలక అంశాలను పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్‌కు సంబంధించి ఎన్నికల సంఘం (ఈసీ)లో జరిగిన సమావేశాలు, తీసుకున్న నిర్ణయాలు, వ్యక్తమైన అభ్యంతరాలు మొదలైన వాటికి సంబంధించిన అన్ని రికార్డులను సమర్పించేలా ఈసీని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఓటర్ల జాబితా తయారీ, మార్పులు చేర్పులలో నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఓటర్ల జాబితాలో సవరణలపై, ఈవీఎంల వినియోగంపై స్వతంత్ర ఆడిటింగ్ జరిపించాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.
పిటిషన్‌లో 14 లోపాలు
విపక్షాల పిటిషన్‌లో 14లోపాలు ఉన్నట్లు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ గుర్తించారు. పిటిషనర్లలో 9మంది సంతకాలు లేకపోవడం, ఖర్గే గుర్తింపు కార్డు ఫొటోకాపీ చెల్లుబాటయ్యేలా లేనట్టు తెలిసింది. అలాగే, చట్టబద్ధమైన పత్రాలు అన్నింటినీ జత చేయలేదు. అక్షరాలు నిబంధనలకు అనుగుణంగా లేకపోవడం, కొన్ని పేజీలు మిస్ కావడంతోపాటు కోర్టు ఫీజును రూ.220 తక్కువగా చెల్లించారు. ఈ లోపాలను అన్నింటినీ సరిచేసిన తర్వాతే పిటిషన్ ఽధర్మాసనం ముందు విచారణకు వెళుతుంది.