Share News

తూర్పు కోస్తాలో ఇంధన వేట

ABN , Publish Date - Jun 07 , 2026 | 05:55 AM

అండమాన్‌ సముద్రంలో ఇటీవల సహజ వాయువు నిక్షేపాలను కనుగొన్న ఆయిల్‌ ఇండియా.. తాజాగా తూర్పు కోస్తాపై దృష్టి పెట్టింది. సముద్ర తీరంలో మళ్లీ సర్వే చేపట్టి కొత్త క్షేత్రాలను కనుగొనాలని నిర్ణయించింది.

తూర్పు కోస్తాలో ఇంధన వేట

  • నాలుగు బేసిన్లలో మళ్లీ సర్వేకు నిర్ణయం

  • నిక్షేపాల గుర్తింపునకు టెండర్లు ఆహ్వానించిన ప్రభుత్వం

న్యూఢిల్లీ, జూన్‌ 6: అండమాన్‌ సముద్రంలో ఇటీవల సహజ వాయువు నిక్షేపాలను కనుగొన్న ఆయిల్‌ ఇండియా.. తాజాగా తూర్పు కోస్తాపై దృష్టి పెట్టింది. సముద్ర తీరంలో మళ్లీ సర్వే చేపట్టి కొత్త క్షేత్రాలను కనుగొనాలని నిర్ణయించింది. దీని కోసం దశాబ్దాల కాలం నాటి సీస్మిక్‌ డేటాను మళ్లీ ప్రాసెస్‌ చేయడానికి, అలాగే ఆశాజనకమైన తీర ప్రాంతాల్లో తాజాగా డీప్‌ వాటర్‌ సర్వే చేపట్టడానికి ప్రభుత్వం గట్టి కసరత్తు చేస్తోంది. మహానది, బెంగాల్‌-పూర్నియా, కావేరి, కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్లలో ఈ సర్వే చేపట్టనుంది. ఈ అన్వేషణ కోసం ఆధునిక ఇమేజింగ్‌ టెక్నాలజీలను ఉపయోగించి గతంలోని 2డీ, 3డీ మెరైన్‌ సీస్మిక్‌ డేటాను రీప్రాసెస్‌ చేయడానికి గ్లోబల్‌ జియోఫిజికల్‌ కంపెనీల నుంచి ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. మల్టీ క్లయింట్‌ మోడల్‌ కింద కొత్త బ్రాడ్‌బ్యాండ్‌ 3డీ సీస్మిక్‌ రీసర్వే చేపట్టడానికి ముందు పాత డేటాను ప్రాసెస్‌ చేయాలని స్పష్టం చేసింది. ఈ కార్యక్రమం 36 నెలల పాటు జరుగుతుందని అంచనా వేస్తున్నారు. సముద్రపు అడుగున ఇప్పటి వరకు గుర్తించని నిక్షేపాలను వెలికితీయడం ద్వారా క్రూడ్‌ ఆయిల్‌, సహజవాయువుల దిగుమతి భారాన్ని తగ్గించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా పునర్‌ సర్వేకు శ్రీకారం చుట్టింది. పాత సీస్మిక్‌ సర్వేకు కొత్త ఇమేజింగ్‌ టెక్నాలజీని అనుసంధానించడంతో సముద్ర గర్భంలోని భూ అంతర్భాగ చిత్రాలను మరింత స్పష్టంగా రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో గుర్తించలేకపోయిన క్షేత్రాలను గుర్తించడంతో పాటు కచ్చితమైన ప్రాంతాల్లో డ్రిల్లింగ్‌ చేయాలని నిర్ణయించింది. ఇంధన నిక్షేపాల విషయంలో తూర్పు కోస్తా కీలకమైనది. ఇప్పటికే ఇక్కడ కొన్ని బావుల్లో ఉత్పత్తి జరుగుతోంది. ఈ బావులు కాకుండా ఇక్కడ ఇంకా ఎక్కువ నిక్షేపాలు ఉన్నాయని భావిస్తున్నారు. మహానది బేసిన్‌లో ఇప్పటివరకు చాలా తక్కువగానే ఉత్పత్తి జరిగింది. బెంగాల్‌-పూర్నియా బేసిన్‌లో పెద్దగా ఇంధన వెలికితీత పనులు జరగలేదు. తమిళనాడు తీరంలోని కావేరీ బేసిన్‌లో ఇప్పటికే గణనీయంగా ఉత్పత్తి జరుగుతోంది.

Updated Date - Jun 07 , 2026 | 05:55 AM