Share News

India Becomes World's Top Rice Producer: వరిధాన్యం ఉత్పత్తిలో భారత్‌ ప్రపంచంలోనే నంబర్‌ 1

ABN , Publish Date - Jan 05 , 2026 | 02:30 AM

వరిధాన్యం ఉత్పాదనలో భారత్‌ ప్రపంచ ఖ్యాతిని ఆర్జించింది. చైనాను అధిగమించి ప్రపంచంలో నంబర్‌ వన్‌గా నిలిచింది. మొత్తంగా 15.01 కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి ఈ ఘనత సాధించింది.

India Becomes World's Top Rice Producer: వరిధాన్యం ఉత్పత్తిలో భారత్‌ ప్రపంచంలోనే నంబర్‌ 1

  • 15 కోట్ల టన్నుల దిగుబడితో చైనా కన్నా ముందంజ: శివరాజ్‌ సింగ్‌

న్యూఢిల్లీ, జనవరి 4: వరిధాన్యం ఉత్పాదనలో భారత్‌ ప్రపంచ ఖ్యాతిని ఆర్జించింది. చైనాను అధిగమించి ప్రపంచంలో నంబర్‌ వన్‌గా నిలిచింది. మొత్తంగా 15.01 కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి ఈ ఘనత సాధించింది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఆదివారం వెల్లడించారు. నూతన విత్తనాలను ఆవిష్కరించిన సందర్భంగా ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌) ఆధ్వర్యంలో రూపొందించిన 25 పంటలకు సంబంధించిన 184 రకాల అధిక దిగుబడి విత్తనాలను ఆయన విడుదల చేశారు. ఆహార కొరత ఉన్న స్థితి నుంచి ప్రపంచానికే ఆహారం అందించే స్థాయి వరకు దేశం ఎదిగిందని, ఇది ఘన విజయమని ప్రశంసించారు. ‘‘వరి ఉత్పత్తిలో భారత్‌..చైనాను అధిగమించింది. ప్రపంచంలోనే అత్యధిక వరి ఉత్పత్తిదారుగా ఎదిగింది. చైనా 14.52 కోట్ల టన్నుల వరిని ఉత్పత్తి చేయగా, భారత్‌ 15.01 కోట్ల టన్నులను ఉత్పత్తి చేసింది’’ అని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లకు బియ్యాన్ని సరఫరా చేస్తున్నామని, దేశంలో సమృద్ధిగా బియ్యం నిల్వలు ఉన్నాయని చెప్పారు. నూతనంగా విడుదల చేసిన విత్తనాలను వెంటనే రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని శివరాజ్‌ సింగ్‌ అధికార్లను కోరారు. నూతనంగా అభివృద్ధి చేసిన విత్తనాలకు గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వడం 1969లో ప్రారంభమయిందని చెప్పారు. ఇంతవరకు 7,205 రకాల విత్తనాలకు నోటిఫికేషన్‌ ఇచ్చినట్టు తెలిపారు. 1969 నుంచి 2014 వరకు 3,969 విత్తనాలకు నోటిఫికేషన్‌ ఇవ్వగా, మోదీ ప్రభుత్వం హయాంలో 3,236 అధిక దిగుబడి విత్తనాలకు నోటిఫికేషన్‌ ఇచ్చినట్టు వివరించారు.

Updated Date - Jan 05 , 2026 | 02:30 AM