చక్కెర ఎగుమతులపై నిషేధం
ABN , Publish Date - May 15 , 2026 | 04:03 AM
చక్కెర ఎగుమతులపై నిషేధం విధిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దేశీయంగా పంచదార లభ్యతను పెంచడంతో పాటు ధరలను నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
సెప్టెంబరు 30 వరకూ అమలులో..: కేంద్రం
న్యూఢిల్లీ, మే 14: చక్కెర ఎగుమతులపై నిషేధం విధిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దేశీయంగా పంచదార లభ్యతను పెంచడంతో పాటు ధరలను నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. సవరించిన చక్కెర ఎగుమతి విధానం తక్షణమే అమల్లోకి వస్తుందని, ముడి చక్కెర, తెల్ల చక్కెర, శుద్ధి చేసిన చక్కెరకు నిషేధం వర్తిస్తుందని పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకూ లేదా తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకూ ఈ నిషేధం అమలులో ఉంటుందని తెలిపింది. అప్పటి వరకూ దీని ఎగుమతులను ‘రిస్ట్రిక్టెడ్’ నుంచి ‘ప్రొహిబిటెడ్’కు సవరిస్తున్నట్లు విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ (డీజీఎఫ్టీ) తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. నిషేధంపై గడువును సెప్టెంబరు 30 తర్వాత పొడిగించకపోతే.. చక్కెర ఎగుమతి విధానం ఆటోమేటిక్‌గా మునుపటి ‘రిస్ట్రిక్టెడ్’ స్థితికి మారుతుందని పేర్కొంది. అయితే సీఎక్స్‌ఎల్, టారిఫ్ రేట్ కోటా(టీఆర్‌క్యూ)ల కింద యూరోపియన్ యూనియన్, అమెరికాకు ఎగుమతి చేసే చక్కెరపై ఈ నిషేధం వర్తించదు. అలాగే అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్, ప్రభుత్వాల మధ్య జరిగే ఎగుమతులతో పాటు ఇప్పటికే లోడింగ్ ప్రారంభమైన సరుకుకి మినహాయింపు ఉంటుందని ఉత్తర్వు ల్లో పేర్కొన్నారు. కాగా, 2025-26 మార్కెటింగ్ సంవత్సరానికి (అక్టోబరు నుంచి సెప్టెంబరు వరకు)గాను 15 లక్షల టన్నుల పంచదార ఎగుమతులకు ఆహార మంత్రిత్వ శాఖ తొలుత అనుమతులు ఇచ్చింది. ఆ త ర్వాత మరో 5 లక్షల టన్నుల కోటా అందుబాటులోకి రాగా, అందులో 87,587 టన్నులకు మాత్రమే ఆమో దం తెలిపింది. దీంతో దాదాపు 16 లక్షల టన్నుల చ క్కెర ఎగుమతికి అనుమతి లభించింది. కాగా, పంచదార ఎగుమతులపై నిషేధం విధించిన నేపథ్యంలో చక్కెర కంపెనీల షేర్లు గురువారం ఒక్కసారిగా కుప్పకూలాయి. ఎన్‌ఎ్‌సఈలో బలరాంపూర్ చిని మిల్స్ షేర్లు 5.6 శాతం పడిపోయి, ఒక్కో షేరు ధర రూ.517.75 వద్ద కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది.