Share News

70 వేల కోట్లతో స్వదేశీ జలాంతర్గాములు

ABN , Publish Date - May 30 , 2026 | 03:10 AM

అత్యాధునిక స్వదేశీ జలాంతర్గాముల తయారీకి కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి తెలిపింది. తదుపరి తరం సంప్రదాయ జలాంతర్గాముల నిర్మాణం కోసం రూ.70 వేల...

70 వేల కోట్లతో స్వదేశీ జలాంతర్గాములు

  • జర్మనీ కంపెనీతో డీల్‌కు ఆర్థిక శాఖ అనుమతి

న్యూఢిల్లీ, మే 29: అత్యాధునిక స్వదేశీ జలాంతర్గాముల తయారీకి కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి తెలిపింది. తదుపరి తరం సంప్రదాయ జలాంతర్గాముల నిర్మాణం కోసం రూ.70 వేల కోట్ల ఒప్పందానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో త్వరలో ప్రధాని నేతృత్వంలో జరిగే రక్షణపై క్యాబినెట్‌ కమిటీ (సీసీఎస్‌) కూడా అనుమతి తెలిపేందుకు లైన్‌ క్లియర్‌ అయిందని సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. ప్రాజెక్టు-75ఐ కింద ఆరు అత్యాధునిక జలాంతర్గాముల నిర్మాణ ప్రతిపాదనను సీసీఎస్‌ పరిశీలించాక ఒప్పందంపై తుది సంతకాలు జరుగుతాయి. ఈనెల 31 నేవీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టే అడ్మిరల్‌ కృష్ణ స్వామినాథన్‌ ఒప్పందంపై సంతకం చేస్తారు. ఈ జలాంతర్గాములను మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌ (ఎండీఎల్‌), జర్మనీకి చెందిన థైసెన్‌కృప్‌ మెరైన్‌ సిస్టమ్స్‌ (టీకేఎంఎస్‌) కలసి ముంబైలో నిర్మిస్తాయి. ఒప్పందంపై సంతకం అయిన 7 ఏళ్ల తర్వాత తొలి జలాంతర్గామిని నేవీకి అప్పగిస్తారు. ఆ తర్వాత ఒక్కో ఏడాది ఒక్కోటి చొప్పున అందిస్తారు. హెచ్‌డీడబ్ల్యూ క్లాస్‌ 214 రకానికి చెందిన ఈ జలాంతర్గాములను ఎయిర్‌ ఇండిపెండెంట్‌ ప్రొపల్షన్‌ (ఏఐ పీ) సాంకేతికతతో నిర్మిస్తారు. ఈ టెక్నాలజీ వల్ల నీటి అడుగున ఎక్కువ కాలం ఉండగలవు, శత్రువులకు ఆచూకీ దొరకకుండా సంచరించగలవు.

Updated Date - May 30 , 2026 | 03:10 AM