Share News

రక్షణ కొనుగోళ్లకు2.38 లక్షల కోట్లు

ABN , Publish Date - Mar 28 , 2026 | 04:56 AM

త్రివిధ దళాలను బలోపేతం చేయటానికి రూ.2.38 లక్షల కోట్ల విలువైన ఆయుధాలను, రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించింది.

రక్షణ కొనుగోళ్లకు2.38 లక్షల కోట్లు

  • లక్ష కోట్లతో వాయుసేనకు 60 కొత్త రవాణా విమానాలు

  • ఇవన్నీ పాత విమానాల స్థానే..

  • రూ.50 వేల కోట్లతో 5 ఎస్‌-400 స్క్వాడ్రన్లు

  • రూ.45 వేల కోట్లతో రిమోట్‌ నియంత్రిత ఫైటర్‌ జెట్లు, డ్రోన్లు

  • సైన్యానికి 300 ధనుష్‌ శతఘ్నులు.. డీఏసీ ఆమోదం

  • మరింత పెరగనున్న రక్షణ సన్నద్ధత: రాజ్‌నాథ్‌సింగ్‌

న్యూఢిల్లీ, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): త్రివిధ దళాలను బలోపేతం చేయటానికి రూ.2.38 లక్షల కోట్ల విలువైన ఆయుధాలను, రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సారథ్యంలోని ‘రక్షణ కొనుగోళ్ల మండలి’ (డీఏసీ) శుక్రవారం ఆమోదం తెలిపింది. దీనిపై రక్షణశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కొత్తగా కొనుగోలు చేసే వాటిలో.. వాయుసేన కోసం 60 మధ్యస్థాయి రవాణా విమానాలు ఉన్నాయి. ప్రస్తుతం వాయుసేన ఉపయోగిస్తున్న పాతబడిపోయిన ఏఎన్‌-32, ఐఎల్‌ 76 విమానాల స్థానంలో వీటిని వినియోగిస్తారు. కొత్త విమానాలు 18 నుంచి 30 టన్నుల పేలోడ్‌ను మోసుకెళ్లే సామర్థ్యంతో ఉంటాయి. కొనుగోలు చేసే మొత్తం 60 విమానాల్లో 12 వినియోగానికి సిద్ధంగా ఉన్నవి కాగా.. మిగిలిన వాటిని భారత్‌లో తయారు చేస్తారు. బ్రెజిల్‌కు చెందిన ఎంబ్రార్‌ సీ-390, యూర్‌పనకు చెందిన ఏ400ఎం, అమెరికా కంపెనీ లాకీద్‌ మార్టిన్‌ రూపొందించే సీ-130జే విమానాలు రక్షణశాఖ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. 60 విమానాల కొనుగోలుకు రూ.లక్ష కోట్ల వ్యయం కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.


ఐదు స్క్వాడ్రన్ల ఎస్‌-400లు

కొనుగోళ్ల కోసం డీఏసీ ఆమోదం తెలిపిన వాటిలో.. ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే 5 దీర్ఘశ్రేణి ఎస్‌-400 క్షిపణి వ్యవస్థల స్క్వాడ్రన్లు, ధనుష్‌ శతఘ్నులు, గగనతల రక్షణ నిఘా వ్యవస్థలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం వాయుసేన వద్ద మూడు స్క్వాడ్రన్ల ఎస్‌-400లున్నాయి. మరో రెండు ఈ ఏడాదిలోనే రానున్నాయి. ప్రస్తుతం ఆమోదం తెలిపిన ఐదు స్క్వాడ్రన్లు వీటికి అదనం. రూ.50 వేల కోట్లతో వీటిని కొనుగోలు చేయనున్నారు. దీంతో వాయుసేన వద్ద మొత్తం 10 స్క్వాడ్రన్ల ఎస్‌-400 వ్యవస్థలుంటాయి. ఆపరేషన్‌ సింధూర్‌ సందర్భంగా భారత సైన్యానికి ఎస్‌-400లు బలమైన దన్నుగా నిలబడిన విషయం తెలిసిందే. మరోవైపు, వాయుసేన కోసం నాలుగు స్క్వాడ్రన్ల రిమోట్‌ నియంత్రిత ఫైటర్‌ విమానాలను (స్ట్రైక్‌ ఎయిర్‌క్రా్‌ఫ్టలు) దేశీయంగా కొనుగోలు చేస్తారు. వీటికి అయ్యే వ్యయం దాదాపు రూ.45 వేల కోట్లు. ప్రతీ స్క్వాడ్రన్‌లో 8 నుంచి 10 ఆయుధ సహిత డ్రోన్‌ వ్యవస్థలు ఉంటాయి. వీటిని శత్రువుల లక్ష్యాలను ఛేదించే మిషన్‌లలో ఉపయోగిస్తారు. దేశీయంగా తయారుచేసే 300 ధనుష్‌ శతఘ్నులను రూ.2,500 కోట్లతో సైన్యం కోసం కొనుగోలు చేయనున్నారు. ప్రస్తుతం సైన్యం వద్ద 114 ధనుష్‌ శతఘ్నులు ఉన్నాయి. ఎస్‌యూ-30 ఎంకేఐ యుద్ధ విమానాల సామర్థ్యాన్ని పెంచే ఏఐ-31 జెట్‌ ఇంజిన్లు, నౌకాదళం, తీరప్రాంత గస్తీదళం కోసం అవసరమైన హోవర్‌క్రా్‌ఫ్టలను కొనుగోలుకూ ఆమోదం లభించింది. వీటికి అదనంగా, సైన్యం కోసం రష్యా కంపెనీ రొసోబోరోన్‌ఎక్స్‌పోర్ట్‌ నుంచి రూ.445 కోట్ల విలువైన తుంగుస్క గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయటానికి రక్షణశాఖ ఆ సంస్థతో శుక్రవారం ఒప్పందం కుదుర్చుకుంది. నౌకాదళానికి చెందిన పీ 81 తీరప్రాంత గస్తీ విమానాల నిర్వహణకు బోయుంగ్‌ ఇండియాతో రూ.413 కోట్ల విలువైన ఒప్పందం కూడా కుదిరింది. ఈ కొనుగోళ్ల ద్వారా భారత రక్షణ సన్నద్ధత మరింత పెరుగుతుందని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు.

Updated Date - Mar 28 , 2026 | 04:56 AM