సాంకేతికతలో మరింత సహకారం!
ABN , Publish Date - Mar 06 , 2026 | 05:30 AM
డిజిటలైజేషన్, శుద్ధ ఇంధనం, క్వాంటం కంప్యూటింగ్, సెమీకండక్టర్లు తదితర అత్యాధునిక సాంకేతిక అంశాల్లో సహకారాన్ని విస్తరించడంతోపాటు రక్షణ, అంతరిక్ష రంగాల్లో...
అవగాహనా ఒప్పందాలపై భారత్, ఫిన్లాండ్ సంతకాలు
ఫిన్లాండ్ అధ్యక్షుడు స్టబ్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు
న్యూఢిల్లీ, మార్చి 5: డిజిటలైజేషన్, శుద్ధ ఇంధనం, క్వాంటం కంప్యూటింగ్, సెమీకండక్టర్లు తదితర అత్యాధునిక సాంకేతిక అంశాల్లో సహకారాన్ని విస్తరించడంతోపాటు రక్షణ, అంతరిక్ష రంగాల్లో లోతైన భాగస్వామ్యంపై భారత్, ఫిన్లాండ్ ఒప్పందాలు చేసుకున్నాయి. భారత్‌కు విచ్చేసిన ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్‌తో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆ వివరాలను సం యుక్త ప్రకటనలోనూ, విలేకరుల సమావేశంలోనూ ఇరువురు నేతలు వెల్లడించారు. ఆయా అంశాల్లో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం దశకు తీసుకెళ్లాలని నిర్ణయించామని మోదీ తెలిపారు. ఉక్రెయిన్ అయినా, పశ్చిమాసియా అయినా యుద్ధం ముగించాలనే తాము పిలుపు ఇస్తున్నామని మోదీ చెప్పారు. ఐక్యరాజ్యసమితికి చెందిన భద్రతామండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం కల్పించాలని అలెగ్జాండర్ స్టబ్ బలంగా గళం వినిపించారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో ప్రపంచ బహుపాక్షిక వ్యవస్థల్లో సంస్కరణలు అవసరమన్నారు. ఇదే విషయాన్ని రైజినా చర్చలు-2026లో పునరుద్ఘాటిస్తానని చెప్పారు.