Share News

చైనా ఎఫ్‌డీఐలకు పచ్చజెండా

ABN , Publish Date - Mar 11 , 2026 | 04:13 AM

భారత్‌లో చైనా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. చైనా సహా భారత్‌తో భూసరిహద్దులు ఉన్న దేశాల నుంచి వచ్చే ఎఫ్‌డీఐల నియంత్రణకు సంబంధించిన నిబంధనల్ని...

చైనా ఎఫ్‌డీఐలకు పచ్చజెండా

  • ముందస్తు అనుమతి లేకుండా 10 శాతం వరకు పెట్టుబడులకు ఓకే

  • నిబంధనలు సవరించిన కేంద్రం

  • మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం

  • పశ్చిమబెంగాల్‌లో రెండు మల్టీ ట్రాకింగ్‌ రైల్వే ప్రాజెక్టులకు కేబినెట్‌ ఆమోదం

న్యూఢిల్లీ, మార్చి 10: భారత్‌లో చైనా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. చైనా సహా భారత్‌తో భూసరిహద్దులు ఉన్న దేశాల నుంచి వచ్చే ఎఫ్‌డీఐల నియంత్రణకు సంబంధించిన నిబంధనల్ని ప్రభుత్వం కొద్దిగా సవరించింది. దీంతో ఈ దేశాల కంపెనీలు భారత కంపెనీల ఈక్విటీలో 10 శాతం వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే పెట్టుబడులు పెట్టవచ్చు. ఇందుకు సంబంధించి 2020లో జారీ చేసిన ప్రెస్‌ నోట్‌ 3ని సవరించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అయితే ఇది ఆయా రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితికి లోబడి మాత్రమే ఉంటుందని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (డీపీఐఐటీ) పేర్కొంది. ఈ పెట్టుబడులు 10 శాతానికి మించితే మాత్రం ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొవిడ్‌ సమయంలో 2020లో కేంద్ర ప్రభుత్వం ప్రెస్‌ నోట్‌ 3 తీసుకొచ్చింది. కొవిడ్‌ సంక్షోభ సమయంలో భారత లిస్టెడ్‌ కంపెనీల షేర్ల ధరలు భారీగా పడిపోయాయి. దీన్ని ఆసరాగా చేసుకుని చైనా కంపెనీలు భారత కంపెనీలను కారు చౌకగా టేకోవర్‌ చేయడాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఈ నిబంధన తీసుకొచ్చింది. మరోవైపు 2020 జూన్‌లో గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణల తర్వాత కేంద్ర ప్రభుత్వం చైనా పెట్టుబడులను మరింత నియంత్రించింది. ఆ దేశానికి చెందిన 200కు పైగా మొబైల్‌ యాప్‌లను నిషేధించింది. ఇక గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత తాగునీటిని అందించే ‘జల్‌ జీవన్‌ మిషన్‌’ను 2028 డిసెంబరు వరకు పొడిగించాలని కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయించింది. ఇందుకోసం రూ.8.57 లక్షల కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేసినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ఈ పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ 2019లో ప్రారంభించారు.


మదురై ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ హోదా

తమిళనాడులో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలోని మదురై విమానాశ్రయానికి అంతర్జాతీయ విమానాశ్రయ హోదా కల్పిస్తూ ఆమోదం తెలిపింది. దీంతోపాటు దివాలా, అప్పుల పరిష్కార చట్టానికి (ఐబీసీ) సవరణల్ని క్యాబినెట్‌ ఆమోదించింది. ఈ చట్టానికి సవరణ బిల్లును ప్రభుత్వం గతేడాది ఆగస్టులో లోక్‌సభలో ప్రవేశపెట్టింది. లోక్‌సభ దీనిని సెలెక్ట్‌ కమిటీకి పంపించగా.. డిసెంబరు కమిటీ నివేదికను సమర్పించింది. ఇక ఎన్నికలకు సిద్ధమవుతున్న మరో రాష్ట్రం పశ్చిమబెంగాల్‌లో కొత్తగా రెండు మల్టీ ట్రాకింగ్‌ రైల్వే ప్రాజెక్టులకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. బెంగాల్‌, ఝార్ఖండ్‌ రాష్ట్రాలను కలుపుతూ ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టులకు రూ.4,474 కోట్లు ఖర్చు చేయనున్నారు.

13న పీఎం-కిసాన్‌ నిధులు

రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నిధులు జమ చేసే పీఎం-కిసాన్‌ పథకం 22వ విడత నిధులు ఈ నెల 13న విడుదల కానున్నాయి. 9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో సుమారు రూ.19వేల కోట్లు జమకానున్నాయి. ఆ రోజున గువాహటీలో జరగనున్న కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మీట నొక్కి నిధులను బదిలీ చేస్తారని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఏడాదికి రూ.6,000లను మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం ఈ పథకం ఉద్దేశం.

Updated Date - Mar 11 , 2026 | 04:13 AM