Share News

రక్షణకు అధిక నిధులు

ABN , Publish Date - Feb 02 , 2026 | 03:56 AM

పాకిస్థాన్‌, చైనా, బంగ్లాదేశ్‌ల నుంచి ఎదురవుతున్న సవాళ్లతోపాటు, ‘ఆపరేషన్‌ సిందూర్‌’ నేపథ్యంలో దేశ రక్షణను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని గుర్తించిన కేంద్రం..

రక్షణకు అధిక నిధులు

  • రూ.7.85 లక్షల కోట్లు కేటాయించిన నిర్మలమ్మ.. గత ఏడాదితో పోలిస్తే 15ు ఎక్కువ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: పాకిస్థాన్‌, చైనా, బంగ్లాదేశ్‌ల నుంచి ఎదురవుతున్న సవాళ్లతోపాటు, ‘ఆపరేషన్‌ సిందూర్‌’ నేపథ్యంలో దేశ రక్షణను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని గుర్తించిన కేంద్రం.. బడ్జెట్‌లో ఈసారి రక్షణ శాఖకు భారీగా రూ.7,84,678 కోట్లు కేటాయించింది. ఇది మన జీడీపీలో 2 శాతానికి సమానం. రక్షణ శాఖకు నిరుడు కేటాయించిన 6.81 లక్షల కోట్లతో పోలిస్తే ఈసారి కేటాయించిన మొత్తం 15శాతం ఎక్కువ. 2026-27లో కేంద్ర ప్రభుత్వం చేసే ఖర్చులో 14.67ు రక్షణ వ్యయమే. ఇతర శాఖలన్నింటి కంటే అత్యధికం ఇది. కాగా.. ఈసారి రక్షణ శాఖకు కేటాయించిన రూ.7.85లక్షల కోట్లలో రెవెన్యూ వ్యయం (సైనికుల జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులు) రూ.3.65లక్షల కోట్లు కాగా.. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ తర్వాత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సైన్యం తక్షణ అవసరాల కోసం, యుద్ధ సన్నద్ధత కోసం మూలధన వ్యయాన్ని రూ.2.19లక్షల కోట్లుగా పేర్కొన్నారు. మూలధన వ్యయం అంటే అత్యంత అధునాతన ఆయుధాల కొనుగోలు, రక్షణ వ్యవస్థల ఆధునికీకరణ, సాంకేతిక పరిజ్ఞానాన్ని నవీకరించడం వంటివాటికి చేసే ఖర్చు. గత ఏడాది రక్షణ బడ్జెట్‌లో మూలధన వ్యయానికి కేటాయించిన మొత్తం (రూ.1.8 లక్షల కోట్లు)తో పోలిస్తే ఇది ఏకంగా 24శాతం అధికం. ఇందులో రూ.63,733 కోట్లు ఎయిర్‌క్రా్‌ఫ్టలు, ఏరో ఇంజన్ల కోసం ఖర్చుచేయనున్నారు. రూ.25,023 కోట్లు నౌకల కోసం కేటాయించారు. రూ.2,19,306 కోట్లలో.. రూ.1.85 లక్షల కోట్లు కొత్త ఆయుధాల కొనుగోలుకు.. అందులోనూ రూ.1.39లక్షల కోట్లు ‘భారత్‌లో తయారీ’ విధానంలో భాగంగా భారతీయ కంపెనీల నుంచి(ప్రైవేటుతో సహా) కొనుగోలు చేయడానికి కేటాయించారు. అంటే.. హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌, భారత్‌ ఎలకా్ట్రనిక్స్‌ లిమిటెడ్‌, భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌, మహీంద్ర డిఫెన్స్‌ సిస్టమ్‌, అదానీ డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్‌ తదితర దేశీయ పరిశ్రమల నుంచే 75శాతం కొనుగోళ్లు చేస్తారు. దేశీయ పరిశ్రమలకు ఆర్డర్లు పెరగడం వల్ల అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి దారి తీసి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.


డీఆర్‌డీవోకు రూ.29,100 కోట్లు

అత్యాధునిక ఆయుధాలను తయారుచేయడమే లక్ష్యంగా డీఆర్‌డీవోకు రూ.29,100కోట్లు కేటాయించారు. ఇందులో మూలధనవ్యయం రూ.17,250కోట్లు (మిగతాది జీతభత్యాలకు).అంటే.. డీఆర్‌డీవో మొత్తం బడ్జెట్‌లో 60శాతం మూలధన వ్యయం కోసమే కేటాయించారు. రక్షణ శాఖ రెవెన్యూ వ్యయం రూ.3.65 లక్షల కోట్లలో రూ.1.58లక్షల కోట్లు యుద్ధ విమానాలు, నౌకల నిర్వహణకు, రూ.2.07లక్షల కోట్లు సైనికుల జీతభత్యాలకు వినియోగిస్తారు.

మాజీ సైనికులకు అండగా..

మాజీ సైనికుల పింఛన్ల కోసం రూ.1.71 లక్షలు కేటాయించిన కేంద్రం, వారికి, వారికుటుంబాలకు నాణ్యమైన వైద్యం అందించి ఈసీహెచ్‌ఎ్‌స (ఎక్స్‌-సర్వీ్‌సమెన్‌ కాంట్రిబ్యూటరీ హెల్త్‌ స్కీమ్‌) బడ్జెట్‌ను నిరుటితో పోలిస్తే ఏకంగా 45.49ుమేర పెంచేసింది. 2025-26లో ఈ పథకానికి రూ,8,317 కోట్లు కేటాయించగా, ఈసారి ఏకంగా రూ.12,100 కోట్లు కేటాయించింది. అంటే.. రూ.3,783 కోట్లు పెంచింది. అలాగే.. సివిల్‌ డిఫెన్స్‌ వ్యయాలకు రూ.28,554కోట్లు కేటాయించారు. కోస్ట్‌ గార్డ్‌, బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (బీఆర్‌వో), రక్షణ శాఖలో పనిచేసే ఉద్యోగుల జీతభత్యాలన్నీ ఈ కేటగిరీ కిందకి వస్తాయి. సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచేందుకు.. బీఆర్‌వోకు రూ.7,394కోట్లు కేటాయించింది. కాగా.. రక్షణశాఖ కేటాయింపులను గణనీయంగా పెంచడంపై ఆ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్‌లో అత్యంత ముఖ్యమైన అంశం మన త్రివిధ దళాల ఆధునీకరణ అని.. అందుకోసం రూ.1.85 లక్షల కోట్లు కేటాయించారని, గత ఏడాదితో పోలిస్తే ఇది 24 శాతం అధికమని.. దీనివల్ల మన సైనిక సామర్థ్యం మరింత శక్తిమంతంగా మారుతుందని ఆయన ఆనందం వెలిబుచ్చారు.

Updated Date - Feb 02 , 2026 | 03:56 AM