రైల్వేకు 2.77 లక్షల కోట్లు
ABN , Publish Date - Feb 02 , 2026 | 03:58 AM
బడ్జెట్‌లో రైల్వేలకు పెట్టుబడి వ్యయం కింద రూ.2,77,830 కోట్లు కేటాయించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన రూ.2,52,000 కోట్లకన్నా ఈసారి 10.25 శాతం నిధుల్ని అదనంగా ఇచ్చారు.
హైదరాబాద్ టూ బెంగళూరు!
2 గంటల్లోనే..
బడ్జెట్‌లో ప్రకటించిన ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లు భారతీయ రైల్వే ముఖచిత్రాన్ని మార్చేస్తాయి. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలను కలుపుతూ ప్రతిపాదించిన ‘దక్షిణాది హైస్పీడ్ ట్రయాంగిల్’ వల్ల ఆయా నగరాల మధ్య ప్రయాణ సమయం ఊహించని రీతిలో తగ్గనుంది. ఈ కారిడార్ అందుబాటులోకి వస్తే.. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు రెండు గంటల్లో, హైదరాబాద్ నుంచి చెన్నైకి 2గంటల 55నిమిషాల్లో, చెన్నై నుంచి బెంగళూరుకు గంట 13నిమిషాల్లో చేరుకోవచ్చు. దక్షిణాది ఆర్థిక వ్యవస్థకు ఈ కారిడార్లు ‘గ్రోత్ ఇంజన్’గా నిలవనుంది.
- రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్
అదనపు వనరుల కింద మరో 15 వేల కోట్లు
ప్రయాణికులు, సరకుల రవాణాలో ఆదాయ లక్ష్యాలను అందుకోలేని రైల్వే
అంచనాల కన్నా రూ.22 వేల కోట్ల తగ్గుదల
పింఛన్లదే ప్రధాన ఖర్చు.. 74,500 కోట్లు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: బడ్జెట్‌లో రైల్వేలకు పెట్టుబడి వ్యయం కింద రూ.2,77,830 కోట్లు కేటాయించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన రూ.2,52,000 కోట్లకన్నా ఈసారి 10.25 శాతం నిధుల్ని అదనంగా ఇచ్చారు. రైల్వేల చరిత్రలోనే ఇది అతి భారీ కేటాయింపు. వీటిని ప్రధానంగా కొత్త లైన్ల నిర్మాణం, పాత లైన్ల విస్తరణ, ఇంజిన్లు, కోచ్‌ల తయారీ, టెలికాం, సిగ్నలింగ్ వ్యవస్థలకు ఉపయోగించనున్నారు. ఈ నిధులతోపాటు అదనపు బడ్జెట్ వనరుల కింద రైల్వేశాఖకు మరో రూ.15 వేల కోట్లు ప్రభుత్వం అందించనుంది. కాగా, 2024-25లో రైల్వే శాఖ రూ.3,35,757 కోట్లను అర్జించగా రూ.3,32,440 కోట్లు వ్యయం చేసింది. నికర మిగులు రూ.3,317 కోట్లు. 2025-26లో ఆదాయం రూ.3,85,733 కోట్లు, ఖర్చులు రూ.3,82,186 కోట్లు, మిగులు రూ.3,547 కోట్లు ఉంటుందని బడ్జెట్ అంచనా వేసింది. మిగులు గత ఏడాది కన్నా రూ.230 కోట్లు మాత్రమే అధికంగా ఉండటం గమనార్హం. 2025-26లో ప్రయాణికుల నుంచి రూ.92,800కోట్ల ఆదా యం, సరకు రవాణా నుంచి రూ.1,88,000 కోట్ల ఆదాయం వస్తుందని ఆశించినప్పటికీ.. అది వరుసగా రూ.80 వేల కోట్లకు, రూ.1,78,457 కోట్లకు పరిమితమైందని సవరణ అంచనాలు తెలిపాయి. ఏసీ త్రీ టైర్ టికెట్ల అమ్మకాల నుంచి రూ.37,115 కోట్ల ఆదాయం వస్తుందని ఆశించగా.. రూ.27,262 కోట్లు మాత్రమే రావటం గమనార్హం. మొత్తమ్మీద, రైల్వేశాఖ ఆదాయ లక్ష్యాలను అందుకోలేకపోయింది. ఇక రైల్వేల వ్యయంలో పింఛన్ల చెల్లింపులదే ప్రధాన వాటా. 2024-25లో ఇది రూ.58,844 కోట్లు ఉండగా, 2025-26లో రూ.74,500 కోట్లకు పెరుగుతుందని అంచనా వేశారు.