జ్ఞానేశ్ జైలుకే!
ABN , Publish Date - Nov 02 , 2026 | 02:37 AM
బీజేపీ ఓట్ల చోరీ, ‘సర్’ పేరిట అక్రమాల్లోభాగస్వామి అయిన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ జైలుకు వెళ్లక తప్పదంటూ ఇండి కూటమి కదం తొక్కింది.
ప్రధాని మోదీ, అమిత్ షా కూడా చట్టపరమైన చర్యలు ఎదుర్కోక తప్పదు
‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ ర్యాలీలో గళమెత్తిన ఇండి కూటమి నేతలు
బీజేపీ చేస్తున్నది కేవలం ఓట్ల చోరీ కాదు.. ప్రజాస్వామ్యానికి తీరని ద్రోహం
ఎన్నికల అక్రమాలతోనే మోదీ, షా ప్రధాని, హోంమంత్రి అయ్యారు
అందరికీ అవకాశం ఉండే శివుడి బారాత్ వంటి దేశం కావాలి: రాహుల్
మోదీ గద్దె దిగాల్సిందే: ఖర్గే.. యూపీ ఎన్నికల నుంచే బీజేపీ ఔట్: అఖిలేశ్
ఢిల్లీలో భారీ ర్యాలీ.. ఒకే ఓపెన్‌టాప్ వాహనంలో నేతలు.. అనంతరం సభ
రాంలీలా మైదానంలో ఖాళీ కుర్చీలు.. ఇండి కూటమిది ప్లాప్ షో: బీజేపీ
న్యూఢిల్లీ, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): బీజేపీ ఓట్ల చోరీ, ‘సర్’ పేరిట అక్రమాల్లోభాగస్వామి అయిన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ జైలుకు వెళ్లక తప్పదంటూ ఇండి కూటమి కదం తొక్కింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా చట్టపరమైన చర్యలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. జ్ఞానేశ్‌కు ఉద్వాసన పలికే వరకు తమ పోరు ఆగదని స్పష్టం చేసింది. ‘ఓట్ బచావో, దేశ్ బచావో’ పేరిట ఆదివారం ఇండి కూటమి ఢిల్లీలో మెగా ర్యాలీ, రాంలీలా మైదానంలో సభ నిర్వహించింది. ఇండి కూటమి నేతలంతా ఇందులో పాల్గొని బీజేపీ ఓట్ల చోరీపై తీవ్రస్థాయిలో గళమెత్తారు. ఆదివారం మధ్యాహ్నం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసం నుంచి ప్రతిపక్ష నేతలు మింటో రోడ్, కన్నాట్ ప్లేస్ జంక్షన్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలోని రాంలీలా మైదానం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రతిపక్ష నేతలంతా ఒకే ఓపెన్ టాప్ వాహనంలో ప్రయాణించారు.
దేశం నలుమూలల నుంచి కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్షాల నేతలు, కార్యకర్తలు, యువజన, విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ‘ఓటు దొంగలు గద్దె దిగాలి. ఓటును కాపాడండి.. దేశాన్ని రక్షించండి’ అంటూ నినాదాలు చేశారు. వారంతా చేరుకోవడంతో రాంలీలా మైదానం నిండిపోయింది.మైదానం వెలుపల కూడా పెద్ద సంఖ్యలో జనం నిలిచిపోయారు. పది లక్షల మంది వస్తారని ప్రతిపక్షాల నేతలు చెప్పినప్పటికీ.. రెండు లక్షల మంది వరకు వచ్చినట్టు అంచనా వేస్తున్నారు. మెగా ర్యాలీకి సారథ్యం వహించిన రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, ప్రియాంకా గాంధీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తదితరులు సభలో ప్రసంగించారు.
మోదీ ప్రభుత్వం గద్దె దిగాలి: ఖర్గే
పోలీసులు, సీబీఐ, ఈడీ వంటి సంస్థలను చూపి బెదిరిస్తే.. ఇండి కూటమి బెదిరిపోదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఓట్ల చోరీ ద్వారా బీజేపీ ప్రజలను విడదీయాలని చూస్తోందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపినప్పుడే ప్రజాస్వామ్యాన్ని కాపాడగలుగుతామని, ‘మోదీని తొలగించాలి.. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి’ అని పిలుపునిచ్చారు. ఇండి కూటమి పక్షాలతో పాటు పౌర సమాజం, విద్యార్థులు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు.
ఫ్లాప్ షో: బీజేపీ
రాంలీలా మైదానంలో ఇండి కూటమి సభ ఒక ఫ్లాప్ షో అని బీజేపీ విమర్శించింది. సభకు 10 లక్షల మంది వస్తారని కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకున్నారని, తీరా చూేస్త మైదానమంతా ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా, కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. రాంలీలా మైదానంలో వేసిన 28 వేల కుర్చీల్లోనే దాదాపు 7 వేల కుర్చీలు ఖాళీగా ఉన్నాయని, ట్రిక్ ఫోటోగ్రఫీ ద్వారా కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో అక్రమాలు జరిగితే, ఇప్పుడు ఆయన అనుభవిస్తున్న ప్రతిపక్ష నేత పదవి, ఆయన కూటమి ఎంపీల పదవులు కూడా అక్రమమేనని పేర్కొన్నారు.
కేవలం ఓట్ల చోరీ కాదు.. ప్రజాస్వామ్యానికి ద్రోహం: రాహుల్
దేశంలో జరుగుతున్నది సాధారణ ఓట్ల చోరీ కాదని.. అది ప్రజల గొంతుకను దొంగిలించడమని, ప్రజాస్వామ్యానికి జరుగుతున్న ద్రోహమని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్, హరియాణా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు.. 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు. ఈవీఎంల ద్వారా, ఓటర్ల జాబితాల్లో పేర్లు తొలగించడం, చేర్చడం ద్వారా అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. సీఈసీ జ్ఞానేశ్‌ను పదవి నుంచి తొలగించడమే దేశాన్ని సరైన దారిలోకి తీసుకెళ్లే తొలి అడుగు అని పేర్కొన్నారు. 2024 ఎన్నికల తర్వాత 15 శాతం భారతీయ ఓటర్ల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారని.. దీనివల్ల మొత్తం ఎన్నికల ప్రక్రియే ప్రహసనంగా మారిందని పేర్కొన్నారు. ఎన్నికల అక్రమాల ద్వారానే మోదీ, షా ప్రధాని, హోంమంత్రి అయ్యారని ఆరోపించారు. ప్రధాని మోదీ ఎక్కడికీ వెళ్లరని అమిత్ షా అంటున్నారని, మోదీ పదవి వదిలి పారిపోవాలనుకున్నా తాము వదిలిపెట్టే ప్రసక్తే లేదని... జ్ఞానేశ్ తర్వాత మోదీనే వెంటాడుతామని చెప్పారు. ఇక కులం, మతం, వర్గం, ఆర్థిక, సామాజిక నేపథ్యంతో సంబంధం లేకుండా దేశంలో అందరికీ సమాన అవకాశాలు లభించాలని పేర్కొంటూ ‘శివుడి బరాత్’ను రాహుల్ గాంధీ ప్రస్తావించారు. ‘‘శివుడి బరాత్ గురించి అంతా వినే ఉంటారు. అందులో ఎలాంటి బేధం లేకుండా ఎవరైనా పాల్గొనవచ్చు. ఆ తాండవంలో ఎవరైనా నృత్యం చేయవచ్చు. ఎవరైనా అక్కడికి వెళ్లవచ్చు. మాకు అలాంటి భారతదేశమే కావాలి. అదానీ వంటి ఎవరో కొందరు వ్యక్తులకే అన్నీ సొంతమయ్యే దేశం కాదు. అలాంటి దేశాన్ని మేం కోరుకోవడం లేదు’’ అని వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్యాన్ని లూటీ చేశారు: మమతా బెనర్జీ
బెంగాల్‌లో తమ పార్టీ ఓడిపోలేదని, ఓట్ల చోరీతో బీజేపీ గెలిచిందని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. బీజేపీ నేతలు దేశ రాజ్యాంగాన్ని దెబ్బతీసి, ప్రజాస్వామ్యాన్ని లూటీ చేశారని ఆరోపించారు. మహిళల గౌరవం దెబ్బతీశారని, ఆఖరికి దేవుడి చందాలను కూడా దొంగతనం చేశారని విమర్శించారు. మోదీ గద్దె దిగాల్సిందేనని, బెంగాల్‌లో బీజేపీకి గుణపాఠం చెబుతామని పేర్కొన్నారు.
శకునిలా సీఈసీ జ్ఞానేశ్: తేజస్వీ యాదవ్
రాంలీలా మైదానంలో సంప్రదాయంగా రామాయణం జరుగుతుందని, ఇప్పుడు ఓట్లు చోరీ చేసిన వారిపై తాము కురుక్షేత్ర యుద్ధం మొదలుపెట్టామని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ చెప్పారు. సీఈసీ జ్ఞానేశ్ మోదీ కీలుబొమ్మగా వ్యవహరిస్తున్నారని.. శకునిలా మారిపోయారని ఆరోపించారు. శకుని మోసపూరిత ఆట ఆడటంతోనే తాము యుద్ధం చేయక తప్పడం లేదని పేర్కొన్నారు.
యూపీ నుంచే బీజేపీ పతనం: అఖిలేశ్
రాంలీలా మైదాన్ ప్రజాస్వామ్య యుద్ధానికి ఒక హల్దీ ఘాట్‌గా మారిందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ అన్నారు. 1576లో మొఘల్ సామ్రాజ్యానికీ, మేవార్ రాజ్యానికీ జరిగిన యుద్ధాన్ని ప్రస్తావించారు. ఉత్తరప్రదేశ్ ద్వారా అధికారంలోకి వచ్చిన వారందరూ.. తిరిగి ఉత్తరప్రదేశ్ ద్వారానే నిష్క్రమించక తప్పదన్నారు. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారణాసి ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్‌కు డబుల్ జీరో ఇచ్చి బుద్ధి చెప్పారన్నారు. 2022లో ఓట్ల చోరీతోనే యూపీలో బీజేపీ గెలిచిందన్నారు.