Share News

ఢిల్లీ అంతటా ‘ఇండీ’ దండు!

ABN , Publish Date - Nov 02 , 2026 | 01:54 AM

ఇండీ కూటమి ‘ఓట్‌ బచావో-దేశ్‌ బచావో’ పేరుతో రాంలీలా మైదాన్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభతో ఢిల్లీ జనసంద్రమైంది.

ఢిల్లీ అంతటా ‘ఇండీ’ దండు!

  • ఇండి కూటమి మద్దతుదారులతో కిక్కిరిసిన వీధులు

  • బహిరంగ సభకు తెలంగాణ, ఏపీ నుంచి 8వేల మంది

న్యూఢిల్లీ, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఇండీ కూటమి ‘ఓట్‌ బచావో-దేశ్‌ బచావో’ పేరుతో రాంలీలా మైదాన్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభతో ఢిల్లీ జనసంద్రమైంది. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన కూటమి నేతలు, కార్యకర్తలు, పౌర సంస్థల ప్రతినిధులు, నిరసనకారులతో రాంలీలా మైదాన్‌ పరిసర ప్రాంతాలు, సెంట్రల్‌ ఢిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌ వీధులు కిక్కిరిసిపోయాయి. సభా ప్రాంగణానికి చేరుకోవడానికి ముందు మధ్యాహ్నం 12 గంటలకు ఇండీ కూటమి నేతల నాయకత్వంలో కన్నాట్‌ ప్లేస్‌లోని మింటో రోడ్‌ జంక్షన్‌ నుంచి సభా వేదిక వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ‘ఓట్‌ బచావో-దేశ్‌ బచావో’, ‘ఓట్‌ చోర్‌ - గద్దీ చోడ్‌’ నినాదాలతో మద్దతుదారులు హోరెత్తించారు. ర్యాలీకి ముందు కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే నివాసం నుంచి సోనియా, రాహుల్‌, టీఎంసీ అధినేత్రి మమత, ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌, తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఓపెన్‌ టాప్‌ జీపుల్లో మింటో రోడ్డుకు చేరుకున్నారు. ప్రియాంక, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఎంపీ ఫరూక్‌ అబ్దుల్లా, ఎన్సీపీ(ఎస్పీ) నాయకురాలు సుప్రియా సూలే, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌, శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్‌ రౌత్‌, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి బేబీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల సీఎంలు సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు, సతీశన్‌ తదితరులు ఈ భారీ ర్యాలీకి నాయకత్వం వహించారు. సీనియర్‌ నేతలు ఓపెన్‌ టాప్‌ వాహనాల్లో ప్రయాణించగా, వేలమంది మద్దతుదారులు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరారు. హరికిషన్‌ సుర్జీత్‌ సింగ్‌ భవన్‌ నుంచి సీపీఎం నేతలు, కార్యకర్తలు.. అజోయ్‌ భవన్‌ నుంచి సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.


రాజా నేతృత్వంలో కార్యకర్తలు ర్యాలీగా మింటో రోడ్డుకు తరలివచ్చారు. ఓపెన్‌ టాప్‌ వాహనంలో రాంలీలా మైదాన్‌కు వస్తున్న సమయంలో సీపీఐ నేత డి. రాజా ఆకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. స్పందించిన రాహుల్‌ గాంధీ తన కాన్వాయ్‌ను నిలిపివేసి, ఆయన్ను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించేలా చొరవ తీసుకున్నారు. ర్యాలీ సందర్భంగా వినూత్న రీతిలో వ్యక్తమైన నిరసనలు ఆకట్టుకున్నాయి. కర్ణాటకకు చెందిన నిరసనకారులు ఓటర్ల జాబితా నుంచి తొలగించిన పేర్లతో కూడిన పొడవైన బ్యానర్‌ను ప్రదర్శించారు. హరియాణా, పంజాబ్‌, యూపీ, రాజస్థాన్‌ ప్రజలు తమ సంప్రదాయ దుస్తుల్లో రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జానపద గీతాలు, డోలు వాయిద్యాలు, డప్పు దరువులతో నృత్యాలు చేస్తూ, ఎన్నికల అక్రమాలను ఎత్తిచూపే కార్టూన్‌ బ్యానర్లతో కూటమి మద్దతుదారులు నిరసన తెలిపారు. సభకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చిన కాంగ్రెస్‌ నేతలతో ఏపీ, తెలంగాణ భవన్‌లు కిటకిటలాడాయి. రెండు రాష్ట్రాల నుంచి 8 వేల మంది వరకు ఢిల్లీకి వచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్‌లో ప్రసంగిస్తున్న సమయంలో మోదీ వ్యతిరేక నినాదాలతో హోరెత్తింది. అంతకుముందు కాంగ్రెస్‌ నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి అధ్వర్యంలో అంబేడ్కర్‌ భవన్‌ వద్ద భారీగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా ఇండి కూటమి సభకు సీజేపీ దూరంగా ఉంది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దిప్కే ఇండీ కూటమి ర్యాలీకి మద్దతు ప్రకటించారు. భారీ ర్యాలీ నేపథ్యంలో సెంట్రల్‌ ఢిల్లీతో పాటు న్యూఢిల్లీ వ్యాప్తంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. దాదాపు 10 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు.

Updated Date - Nov 02 , 2026 | 01:56 AM