బిల్లులను అడ్డుకుంటాం!
ABN , Publish Date - Apr 16 , 2026 | 03:18 AM
మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఇండియా కూటమి అనుకూలంగానే ఉందని, కానీ దానిని తీసుకువచ్చే విధానంపైనే అభ్యంతరాలు ఉన్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే తెలిపారు..
వ్యతిరేకంగా ఓటేయాలని ఇండియా కూటమి నిర్ణయం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఇండియా కూటమి అనుకూలంగానే ఉందని, కానీ దానిని తీసుకువచ్చే విధానంపైనే అభ్యంతరాలు ఉన్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే తెలిపారు. రిజర్వేషన్ బిల్లును నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టి కేంద్రం రాజకీయ కుతంత్రాలు చేస్తోందని ధ్వజమెత్తారు. పునర్విభజన బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమి ఇండియాకు చెందిన ఎంపీలందరమూ పార్లమెంటులో ఐక్యంగా పోరాడుతామని తెలిపారు. బుధవారం ఢిల్లీలోని రాజాజీ మార్గ్‌లో ఉన్న ఖర్గే నివాసంలో ఇండియా కూటమి పార్టీల సమావేశం జరిగింది. ఈ భేటీలో కూటమికి చెందిన దాదాపు 20 పార్టీల నేతలు పాల్గొన్నారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టనున్న 131వ రాజ్యాంగ సవరణ (మహిళా రిజర్వేషన్), పునర్విభజన, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన బిల్లులపై అనుసరించాల్సిన వ్యూహంపై సుధీర్ఘంగా చర్చించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రం ఏకపక్షంగా తీసుకొస్తున్న బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించారు. అనంతరం, కూటమి మీడియాతో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లును తాము మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నామని, 2010లో ఈ బిల్లు తెచ్చినప్పుడు, 2023లో రాజ్యాంగ సవరణ ఏకగ్రీవంగా ఆమోదం పొందినప్పుడు కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పటికీ, మహిళా బిల్లును రాజకీయ సాధనంగా వాడుకోకుండా.. అమలు చేయమనే ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. అయితే, ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిన తీరు రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని విమర్శించారు. ‘అస్పష్టమైన జనాభా గణాంకాలతో, భవిష్యత్తులో జరగబోయే పునర్విభజన ప్రక్రియతో మహిళా బిల్లును ముడిపెట్టడాన్నే తప్పుబడుతున్నాం. పార్లమెంటుకు ఉండే అధికారాలను కార్యనిర్వాహక వర్గం తన గుప్పిట్లోకి తీసుకుని, రాజకీయ ప్రయోజనాల కోసం నియోజకవర్గాల సరిహద్దులను మార్చుకోవాలని చూస్తోంది. గతంలో అస్సాం, జమ్మూ-కశ్మీర్‌లలో ఇటువంటి మాయాజాలాన్ని చూశాం. అందుకే విపక్షాలన్నీ ఏకమై దీనిని అడ్డుకుంటాయి’ అని ఖర్గే తెలిపారు.
అన్యాయాన్ని చూస్తూ ఊరుకోం: రాహుల్
కేంద్రం ప్రతిపాదిస్తున్న రాజ్యాంగ సవరణలకు మహిళా రిజర్వేషన్లకు సంబంధం ఏమిటని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. పునర్విభజన ముసుగులో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి చేస్తున్న కుట్రగా ఈ వ్యవహారాన్ని ఆయన అభివర్ణించారు. కులగణనపై స్పష్టతనివ్వకుండా ఓబీసీ, దళిత, ఆదివాసీల వాటాను కాజేయాలని చూసినా, దక్షిణాది, ఈశాన్య, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ప్రస్తుత లోక్‌సభ బలం 543 స్థానాల ఆధారంగానే 2029 సాధారణ ఎన్నికల నుంచి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. గతంలో 2024 ఎన్నికల నుంచే దీనిని అమలు చేయాలని విపక్షాలు డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఒబ్రెయిన్ ఎక్స్‌లో ఓ పోస్టులో.. లోక్‌సభలో బిల్లు పేరుతో కేంద్రప్రభుత్వం చేయనున్న స్టంట్‌ను ఓడించటానికి అన్ని ప్రయత్నాలూ చేస్తామన్నారు.
పాల్గొన్న పలువురు నేతలు
ఇండియా కూటమి సమావేశంలో ఖర్గే, రాహుల్ గాంధీ, జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా(నేషనల్ కాన్ఫరెన్స్), సనాతన పాండే, రామశంకర్ రాజ్ భర్(సమాజ్‌వాదీ పార్టీ), టీఆర్ బాలు(డీఎంకే), సాగరిక ఘోష్(టీఎంసీ), సర్ఫరాజ్ అహ్మద్(జేఎంఎం), తేజస్వి యాదవ్, సంజయ్ యాదవ్(ఆర్‌జేడీ), సంజయ్ రౌత్(శివసేన-యూబీటీ), సుప్రియా సూలె(ఎన్‌సీపీ- శరద్ పవార్), సంజయ్ సింగ్(ఆప్), నీలోత్పల్ బసు(సీపీఎం), మహమ్మద్ బషీర్(ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్), అన్నీ రాజా(సీపీఐ), ఎన్.కే.ప్రేమ్ చంద్రన్ (రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ-ఆర్‌ఎస్పీ), రాజారాం సింగ్ (సీపీఐ ఎంఎల్), జోష్ కె.మణి (కేరళ కాంగ్రెస్-ఎం), ఫ్రాన్సిస్ జార్జ్ (కేరళ కాంగ్రెస్-వేరియస్ ఫంక్షన్స్), రవికుమార్ (వీసీకే), దరుల్ వైకో (డీఎండీకే), స్వతంత్ర అభ్యర్థి కపిల్ సిబాల్ హాజరయ్యారు. అఖిలేష్ వర్చువల్‌గా హాజరయ్యారు.