ఈసీకి ఇండి కూటమి 48 ప్రశ్నలు
ABN , Publish Date - Nov 17 , 2026 | 02:33 AM
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, ఇండి కూటమికి చెందిన ఇతర నాయకులు.. ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్)పై ఎన్నికల సంఘానికి (ఈసీకి) 48 ప్రశ్నలు సంధించారు.
ఎస్‌ఐఆర్‌పై నిర్ణయం సమష్టిగా తీసుకున్నారా? సీఈసీ ఒక్కరేనా?
ఇతర కమిషనర్లు అభ్యంతరం తెలిపారా?
ఓట్ల తొలగింపు అధికారం ఎవరిది?
ఆన్‌లైన్ ఫారం-6లో మార్పులు ఎవరు చేశారు?
ఈసీని ప్రశ్నించడానికి అనుమతి కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
న్యూఢిల్లీ, నవంబరు 16: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, ఇండి కూటమికి చెందిన ఇతర నాయకులు.. ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్)పై ఎన్నికల సంఘానికి (ఈసీకి) 48 ప్రశ్నలు సంధించారు. వాటిని ఈసీకి అధికారికంగా అందించి, వివరాలు రాబట్టటానికి వీలుగా సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు అనుమతితో ఒక పక్షం మరో పక్షానికి లిఖితపూర్వకంగా ప్రశ్నలు సంధించవచ్చు. వీటిని ‘ఇంటరాగేటరీలు’ అని అంటారు. కాగా, ఈ 48 ప్రశ్నల్లో ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన పలు అంశాలు ఉన్నాయి. ఎస్‌ఐఆర్‌ను చేపట్టాలనే నిర్ణయాన్ని ఈసీలోని కమిషనర్లందరూ సమష్టిగా తీసుకున్నారా? లేక, ఇతర కమిషనర్లకు తెలియకుండా లేదా వారి ఆమోదం లేకుండానే ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) ఒక్కరే తీసుకున్నారా? ఎస్‌ఐఆర్, ఆన్‌లైన్ ఫారం-6లో మార్పులు, ఈసీఐనెట్, ఈఆర్‌వోనెట్ వంటి ఎలక్టోరల్ రోల్ డేటాబేస్‌ల పనితీరుకు సంబంధించి ఈసీ తీసుకున్న నిర్ణయాలపై రికార్డులు ఎందుకు అందుబాటులో లేవు? ఈసీ పోర్టల్‌లో చేసిన మార్పులేమిటి? వాటిని ఈసీలో ఎవరు చేశారు? ఎస్‌ఐఆర్, ఈసీఐనెట్, ఈఆర్‌వోనెట్, ఫాం 6, పశ్చిమ బెంగాల్‌లో ఓట్ల తొలగింపుపై దాఖలైన అప్పీళ్లు మొదలైన వాటిపై ఎన్నికల కమిషనర్లలో ఎవరైనా లిఖితపూర్వకంగా అభ్యంతరాలను వ్యక్తం చేశారా? లేదా? ఈ ఏడాది జూలై 30వ తేదీన ఇద్దరు కమిషనర్లు సంయుక్తంగా ఇచ్చిన ఆదేశాలను సీఈసీ అంగీకరించారా? ఓటర్ల జాబితాలో పేర్లను తొలగించే, చేర్చే, కొనసాగించే అధికారం ఎవరికి ఉంది? ఎస్‌ఐఆర్‌లో భాగంగా ఏ రాష్ట్రంలో ఎన్ని ఓట్లను తొలగించారు? కారణాలేమిటి? తదితర ప్రశ్నలున్నాయి.
కాగా సీఈసీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ గతంలో ప్రతిపక్ష నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈసీ స్పందించింది. నిర్ణయాలన్నీ సమష్టిగా తీసుకున్నవేనంటూ ఈసీ తరఫున డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఏటూరు భానుప్రకాశ్ సుప్రీంకోర్టులో 248 పేజీల అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో, ఇండియా కూటమి నేతలు తాజాగా 48 ప్రశ్నలు సంధించారు. వీటికి భానుప్రకాశ్‌తోపాటు సీఈసీ, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు, ఈసీ డైరెక్టర్ జనరల్(ఐటీ) అఫిడవిట్ రూపంలో సమాధానాలు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాల్సిందిగా సుప్రీంకోర్టును కోరారు. ఓట్ల చోరీపై తాము పలుమార్లు అడిగిన ప్రశ్నలకు ఈసీ తన అఫిడవిట్‌లో సమాధానాలు ఇవ్వటం లేదు కాబట్టే, ఈసీని ప్రశ్నించటం కోసం సుప్రీంకోర్టు అనుమతి కోరామని కాంగ్రెస్ పార్టీ ఎక్స్‌లో పేర్కొంది.